మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బి.ఇడి) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్ 2022 షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 7 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి, వైస్ ఛైర్మస్ వి.వెంకటరమణ, ఎడ్‌సెట్ కన్వీనర్ ఎ.రామకృష్ణతో కలిసి ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అభ్యర్థులకు ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు జనరల్ అభ్యర్థులు రూ.650, ఎస్‌సి, ఎస్‌టిలు రూ .450 చెల్లించాలన్నారు. రూ.250 ఆలస్య రుసుంతో జులై 1 వరకు రూ. 500 ఆలస్య రుసుంతో జులై 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
జులై 26, 27 తేదీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. 50 శాతం మార్కులతో డిగ్రీ, ఇంజినీరింగ్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎడ్‌సెట్‌కు అర్హులు.ఎస్‌సి,ఎస్‌టి, బిసి, ఇతర రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉంటే అర్హులు అని పేర్కొన్నారు. ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఎడ్‌సెట్ పరీక్ష రాయవచ్చని అన్నారు. ఎంబిబిఎస్, బి.ఫార్మసీ, అగ్రికల్చర్ బిఎస్‌సి, ఎల్‌ఎల్‌బి వంటి వృత్తి విద్యా కోర్సులు చదివిన అభ్యర్థులు బి.ఇడి చేయడానికి అనర్హులని స్పష్టం చేశారు.