చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
మన తెలంగాణ/ములుగు జిల్లా: పత్తి చేలలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసిన సంఘటన ములుగు జిల్లా దేవగిరి పట్నం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవగిరిపట్నం గ్రామంలో ముగ్గురు రైతులు పత్తి చేలల్లో గంజాయి మొక్కలను పెంచుతూ అమ్ముతున్నట్లు పక్కా సమాచారం మేరకు మంగళవారం ఉదయం ములుగు ఎఎస్‌పి సుధీర్ రామ్ నాథ్‌కేకన్ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. కొన్ని రోజులుగా పత్తి చేలల్లో రైతులు ముగ్గురు కలిసి గంజాయి మొక్కలను పెంచుతూ వ్యాపారం చేయడం జరుగుతుందని తెలువడంతో సంఘటన స్థలానికి ములుగు తహసీల్దారు సత్యనారాయణ స్వామి, ములుగు ఎఎస్‌పి, సిఐ గుంటి శ్రీధర్, ఎస్‌ఐ ఓంకార్‌యాదవ్‌లు కలిసి మొక్కలు స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మత్తు పదార్థాలను వాడకూడదని వాటిని వినియోగించకూడదని, గంజాయి మొక్కలను పెంచితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎఎస్ పి హెచ్చరించారు.