మనతెలంగాణ/హైదరాబాద్: తొమ్మిది నెలల చిరుప్రాయంలోనే తీవ్ర అనారోగ్యానికి గురైన బాబుకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవ చూపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు లచ్చయ్య, నిహారికల తొమ్మిది నెలల బాబు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్‌లో పరీక్షలు జరుపగా, బాబు గుండెకు అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఆ పేద దంపతులు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ని సంప్రదించగా, వెంటనే ఆయన సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులకు వివరాలు పంపగా.. రూ.2 లక్షల ఎల్ఒసి మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం వారికి అందజేశారు. తమ బాబు గుండె శస్త్ర చికిత్సకు ఎల్‌ఒసి అందుకున్న ఆ దంపతులు ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కొప్పులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Koppula Eshwar helped Child in Heart Treatment