ఇస్లామాబాద్: మూడు నెలల్లో ఎన్నికలు జరగాలనుకున్న పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు ఆ దేశ ఎన్నికల కమిషన్ జలక్ ఇచ్చింది. వివిధ కారణాలను చూపుతూ ఈ ఎన్నికలను నిర్వహించడానికి కనీసం ఆరు నెలలు పడుతుందని చెప్పింది. న్యాయపరమైన, రాజ్యాంగపరమైన, లాజిస్టికల్ సవాళ్ల వల్ల ఈ ఎన్నికలను మూడు నెలల్లోగా నిర్వహించడం సాధ్యం కాదని తెలియజేసింది. ఇమ్రాన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై పాకిస్థాన్ పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఆదివారం తిరస్కరణకు గురైంది. వెంటనే పార్లమెంటును రద్దు చేయాలని, మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఇమ్రాన్ ఆ దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వీకి సిఫారసు చేశారు. కాసేపట్లోనే నేషనల్ అసెంబ్లీని రద్దు చేసినట్టు అల్వీ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎన్నికల కమిషన్ అధికారి ఒకరి అభిప్రాయాన్ని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం ఈ ఎన్నికలను మూడు నెలల్లోగా నిర్వహించడం సాధ్యం కాదు. నియోజకవర్గాల పునర్వవస్థీకరణ, ముఖ్యంగా కైబర్ ఫక్తూంక్వాలో నియోజక వర్గాలు పెరగనున్నాయి. జిల్లా, నియోజక వర్గాల వారీగా ఓటర్ల జాబితాలను తయారు చేయడం ప్రధాన సవాళ్లు. ఎన్నికల నిర్వహణకు కనీసం ఆరు నెలలు అవసరం. నియోజకవర్గాల పునర్వవస్థీకరణ ప్రక్రియకు చాలా సమయం పడుతుంది. అభ్యంతరాలను తెలియజేయడానికి ఒక నెల సమయం ఇవ్వాలని చట్టం చెబుతోంది. ఎలక్షన్ మెటీరియల్‌ను సేకరించడం, బ్యాలట్ పేపర్ల ముద్రణ, పోలింగ్ సిబ్బందికి శిక్షణనిచ్చి, నియమించడం వంటివాటికి కూడా సమయం పడుతుంది. వీటన్నిటికీ బిడ్‌లను ఆహ్వానించి, తనిఖీ చేసి, ఖరారు చేయడానికి కూడా సమయం పడుతుంది. లక్ష పోలింగ్ స్టేషన్లకు ఈ ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. ఎన్నికల చట్టం లోని సెక్షన్ 14 ప్రకారం ఎన్నికల షెడ్యూల్‌ను నాలుగు నెలల ముందుగా ప్రకటించవలసి ఉంటుంది. బలూచిస్థాన్ లోకల్ గవర్నమెంట్ ఎన్నికలు మే 29న జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అదే విధంగా పంజాబ్, సింధ్, ఇస్లామాబాద్ లోకల్ గవర్నమెంట్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది.
పాక్ జాతీయ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ రికార్డును కోరిన సుప్రీం కోర్టు
ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంపై అసెంబ్లీ ప్రొసీడింగ్స్ రికార్డును పాక్ సుప్రీం కోర్టు మంగళవారం కోరింది. కొన్ని గంటల్లోనే దీనిపై స్వయంగా విచారణకు సిద్ధమైన సుప్రీం కోర్టు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టిన తరువాత ప్రొసీడింగ్స్ మినిట్స్‌ను సమర్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణ బుధవారానికి వాయిదా వేసింది. చీఫ్ జస్టిస్ ఉమర్ అలా బండియాల్ ఆధ్వర్యంలో జస్టిస్‌లు ఇజజుల్ అసన్, మొహ్మద్ అలి మఝార్, మునిబ్ అఖ్తర్, జమాల్ ఖాన్ మండోఖైల్ తో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. ఈసందర్బంగా చీఫ్ జస్టిస్ బండియాల్ మాట్లాడుతూ.. అవిశ్వాస తీర్మానం రద్దుకు డిప్యూటీ స్పీకర్ చర్యలు తీసుకోవడంలోగల రాజ్యాంగ బద్ధతను నిర్ధారించడమే కోర్టు కాంక్షిస్తోందని చెప్పారు. డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన రూలింగ్ పైనే తమ దృష్టి కేంద్రీకరించినట్టు దీని ప్రాధాన్యతను నిర్ణయించడమే తమ బాధ్యతగా చెప్పారు.
Pakistan EC Shock to Imran Khan on Early Election