4వ యూనిట్లో సాంకేతిక లోపం, వెంటనే మరమ్మత్తులు
మనతెలంగాణ/హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపిసిలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బాయిలర్ ట్యూబ్ లీకేజీ ఏర్పడడంతో విద్యుత్ ఉత్పత్తి పడిపోయింది. సాంకేతిక లోపాన్ని గుర్తించిన అధికారులు మరమ్మతులు ప్రారంభించారు. ఇక్కడ ఏర్పడిన సాంకేతిక లోపంతో మంగళవారం విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రామగుండం ఎన్టీపిసి 4వ యూనిట్‌లో 500 మెగా వాట్ల సామర్థ్యం గల యూనిట్‌లోని బాయిలర్ ట్యూబ్ లీకేజీ ఏర్పడడంతో విద్యుత్ ఉత్పత్తి క్రమేపీ పడిపోయిందని అధికారులు తెలిపారు. సాంకేతిక లోపాన్ని గుర్తించిన అధికారులు మరమ్మతులు ప్రారంభించారు. ఎన్టీపిసి విద్యుత్ పరిశ్రమలోని 200 మెగావాట్ల సామర్థ్యం గల 1వ యూనిట్లో ఇప్పటికే వార్షిక మరమ్మతులు కొనసాగుతుండగా, మిగిలిన ఐదు యూనిట్లలో దాదాపు 1700 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక లోపంతో నిలిచిన 4వ యూనిట్‌లో త్వరితగతిన విద్యుత్ ఉత్పత్తి దశలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.