రాహుల్‌తో భేటీ తర్వాత జగ్గారెడ్డి వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్ : తన భార్య, కుమార్తెను పరిచయం చేసేందుకు రాహుల్ గాంధీని కలిసినట్లు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. రాహుల్‌తో భేటీ అనంతరం ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ మార్గదర్శకత్వంలో పనిచేస్తామని చెప్పారు. టిఆర్‌ఎస్, బిజెపి, ఎంఐఎంలపై గట్టిగా పోరాడాలని రాహుల్ తెలిపారని వెల్లడించారు.
ఈ మూడు పార్టీలపై పోరాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా చేయాలని చెప్పారని తెలిపారు. మూడు గంటల పాటు సాగిన సమావేశంలో అనేక అంశాలను రాహుల్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. పార్టీలో విభేదాల గురించి తాను ఏమీ మాట్లాడలేదని పేర్కొన్నారు. తనకు ఎన్నో పార్టీల నుంచి ఆహ్వానం అందాయని.. కానీ, కాంగ్రెస్‌ను వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు. మనమంతా ఒక కుటుంబమని రాహుల్ చెప్పారని వెల్లడించారు. కాగా పిసిసి చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుంచి తనకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని జగ్గారెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న తనకు కీలక నేతల కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే జగ్గారెడ్డి నిర్వహిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటు పలు బాధ్యతల నుంచి ఆయనను తప్పిస్తూ రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో భగ్గుమన్న జగ్గారెడ్డి.. తాను అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలతో రాహుల్‌గాంధీతో జగ్గారెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.