క్వార్టర్ ఫైనల్లో సింధు, శ్రీకాంత్
సాత్విక్‌చిరాగ్ జోడీ ముందంజ
కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
సన్‌చెయాన్: కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్లు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్‌చిరాగ్ షెట్టి జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్ పోరులో విజయం సాధించింది. అయితే పురుషుల సింగిల్స్‌లో భారత యువ సంచలనం లక్షసేన్ రెండోరౌండ్‌లోనే ఓటమి పాలయ్యాడు. ఇక గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్ ఫైనల్ పోరులో సింధు సునాయాస విజయం సాధించింది. జపాన్ షట్లర్ ఆయా ఒహోరితో జరిగిన మ్యాచ్‌లో సింధు 21-15, 21-10 తేడాతో జయకేతనం ఎగుర వేశాడు. ఆరంభం నుంచే సింధు దూకుడుగా ఆడింది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ముందుకు సాగింది. ఇదే క్రమంలో తొలి సెట్‌ను కూడా దక్కించుకుంది. రెండో గేమ్‌లో మరింత దూకుడును ప్రదర్శించింది. ప్రత్యర్థిని హడలెత్తిస్తూ అలవోకగా సెట్‌ను దక్కించుకుంది. వరుసగా రెండు సెట్లను గెలిచిన సింధు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే భారత్‌కు చెందిన మరో షట్లర్ మాల్విక బన్సోద్ రెండో రౌండ్‌లోనే ఓటమి పాలైంది. థాయిలాండ్ సంచలనం పోర్న్‌పావి చొచువాంగ్‌తో జరిగిన పోరులో బన్సోద్‌కు చుక్కెదురైంది.
కాగా, పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ విజయం సాధించాడు. ఇజ్రాయిల్ షట్లర్ మిషా జిల్బర్మాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-18, 21-6 తేడాతో జయకేతనం ఎగుర వేశాడు. తొలి గేమ్‌లో శ్రీకాంత్‌కు ప్రత్యర్థి నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. అయితే, ఆఖరు వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న శ్రీకాంత్ సెట్‌ను దక్కించుకున్నాడు. ఇక రెండో సెట్‌లో శ్రీకాంత్‌కు ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన శ్రీకాంత్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ముందంజ వేశాడు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్‌సాయిరాజ్ జోడీ విజయం సాధించింది. ప్రీక్వార్టర్ ఫైనల్లో భారత జంట 21-15, 21-19 తేడాతో సింగపూర్‌కు చెందిన హీ యంగ్‌లో కీన్ జోడీని ఓడించింది. మరోవైపు పురుషుల సింగిల్స్ యువ ఆటగాడు లక్షసేన్ రెండో రౌండ్‌లోనే ఓటమి పాలయ్యాడు. ఇండోనేషియా షట్లర్ షెషర్ హిరెన్‌తో జరిగిన పోరులో లక్షసేన్ పరాజయం చవిచూశాడు. ఇక అశ్విని పొన్నప్పసుమీత్ రెడ్డి జోడీ కూడా రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది.
Korea Open Badminton 2022: Sindhu reached quarterfinals