యుపిఐ నుంచి ఐపిఎల్ మ్యాచ్‌ల వరకు..
ఇంకా కిరాణా, విమాన టికెట్లు, హోటల్ బుకింగ్‌లు కూడా
ఫ్లిప్‌కార్ట్, జియోమార్ట్‌లకు గట్టి పోటీనివ్వడమే
న్యూఢిల్లీ : ఉప్పు నుంచి స్టీల్ వరకు బహుళ వ్యాపారాలు కల్గిన టాటా గ్రూప్ కొత్త సూపర్ యాప్ ‘టాటా న్యూ’ను ఆవిష్కరించింది. కిరాణా వస్తువులు, ఎలక్ట్రానిక్స్, ఫ్లైట్ బుకింగ్స్, ఫుడ్ డెలివరీ, ఇన్వెస్ట్‌మెంట్, హోటల్ బుకింగ్స్ వంటి అనేక సేవలను ఈ ఒక్క యాప్‌తోనే పొందవచ్చు. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. టాటా గ్రూప్ ప్రధాన లక్ష్యం కంపెనీ మొత్తం డిజిటల్ వింగ్‌ను పెంచడం, తద్వారా ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జియోమార్ట్ వంటి కంపెనీలకు గట్టి పోటీని ఇవ్వడమే. టాటా కొత్త యాప్ ద్వారా విమాన టికెట్లు, హోటళ్లు, మందులు, కిరాణా సామాగ్రిని ఒకే ప్లాట్‌ఫామ్‌పై పొందేందుకు వీలుకల్గుతుంది. టాటా న్యూ యాప్ ఇంటర్‌ఫేస్ ఫోటోలో డార్క్ థీమ్‌తో పాటు అనేక విభిన్న చిహ్నాలు కనిపిస్తాయి. ఈ యాప్ నుండి కారును కూడా బుక్ చేసుకోవచ్చు.
సూపర్ యాప్‌లు ఎందుకు?
భారీ జనాభా కల్గిన భారతదేశం డెస్క్‌టాప్ కాకుండా స్మార్ట్‌ఫోన్ నుండి మరిన్ని సేవలు, ఫీచర్లను కోరుకుంటోంది. అత్యధిక జనాభా ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్న మార్కెట్‌గా భారత్ మారుతోంది. ప్రస్తుతం 90 శాతం మంది సబ్‌స్ర్కైబర్లు మొబైల్ ద్వారా ఇంటర్నెట్‌ను సర్ఫింగ్ చేస్తున్నారు. అందువల్ల చాలా కంపెనీలు సూపర్ యాప్‌లను తయారు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇదే కాకుండా సూపర్ యాప్స్ ద్వారా ఆదాయాన్ని పెంచడంతో పాటు వినియోగదారుల డేటా నుండి మరింత సమాచారాన్ని సేకరించే వీలుకల్గుతుంది. సాధారణంగా పెద్ద కంపెనీలు సూపర్ యాప్‌లను తయారు చేస్తాయి. ఇవి వివిధ రకాల సేవలు, ఉత్పత్తులను అందిస్తాయి. వారు ఈ ఆఫర్‌లను సూపర్ యాప్ ద్వారా ఒక ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు.