మన తెలంగాణ/పంజాగుట్ట: తీగ లాగితే డొంక కదిలేలా ఉంది బంజారాహిల్స్ రాడిసిన్ పబ్ వ్యవహారం. పబ్, డ్రగ్స్ వ్యవహారం పక్కన బెడితే రాడిసిన్ హోటల్‌లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు అన్ని ఇన్ని కావు అని అధికారుల దర్యాప్తులో తేలినట్టు సమాచారం. రాడిసిన్ హోటల్ గదుల్లో జరిగిన తెర వెనుక కార్యకలాపాల గురించి పలువురు ప్రముఖులు తరచూగా ఈ హోటల్‌కి వచ్చి రాసలీలలు కొనసాగించినట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ రాడిసిన్ వ్యవహారంలో మొదట కేవలం పబ్ సమయం మించి తెరిచి ఉంచడం, డ్రగ్స్ వినియోగంపై మాత్రమే ఆరోపణలు వినిపించాయి. కానీ పోలీసుల దాడి తర్వాత ఈ వివాదం మరింత ముదరడంతో వివిధ శాఖలకు చెందిన అధికారులు అంశంలో జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఈ హోటల్‌లోని పుడ్డింగ్ మింక్ పబ్ తోపాటు హోటల్ కార్యకలాపాలపై అధికారు లు దర్యాప్తు చేపట్టారు. పోలీస్ శాఖతో పాటు ఎక్సైజ్ శాఖ, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, ఇన్ కంటాక్స్, రెవెన్యూ శాఖలు ఈ హోటల్ కార్యకలాపాలపై తమదైన శైలిలో దర్యాప్తు చేయడం మొదలు పెట్టినట్టు విశ్వనీయ సమాచారం. ఈ హోటల్ మాటున జరుగుతున్న ఏమి టి, ఎవరి అండతో ఈ హోటల్ కొనసాగుతుంది అన్న విషయం పై ఆరా తీయగా అసలు రాడిసిన్ గదుల్లో జరుగుతున్న తతంగం బయటకు వచ్చినట్టు సమాచారం. ఈ హోటల్‌ని అడ్డుపెట్టుకొని అనేక మంది ప్రముఖులు, వారిపుత్ర రత్నాలు అనేక అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనట్టు తెలిసింది. విదేశీ అమ్మాయిలతో రాసలీలలు, సెలబ్రిటీలతో విందులు, చిందులు, గ్రూప్ సెక్స్ పార్టీలకు ఈ హోటల్‌లో పలువురు ప్రముఖులు, వారి పుత్రుల పేరిట గదులు బుక్ చేసినట్టు అధికారులు గుర్తించడంతో పాటు వారి వివరాల చిట్టా సేకరించినట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు.
దర్యాప్తులో తమను దిగ్భ్రాంతికి గురి చేసే నిజాలు బయట పడ్డాయని, అనేక మంది రాజ కీయ ప్రముఖులతో పాటు సినీ పరిశ్రమ, ప్రముఖ వ్యాపార వేత్తల పిల్లల పేరిట గదులు బుక్ చేసి ఉన్నాయని, ఇక హోటల్ సిబ్బందిని అంతర్గత విచారణ చేయగా వీరంతా ఈ హోటల్‌ని అడ్డాగా చేసుకొని తమ కార్యకలాపాలు కొనసాగించినట్టు దర్యాప్తులో తెలినట్టు ఆ అధికారి తెలిపారు. అయితే లోతుగా విచారణ జరిపి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందచేస్తామని పేరు చెప్పడానికి ఇష్ట పడని ఆ అధికారి పేర్కొన్నారు. హోటల్ లో జరిగిన కొంత రాసలీలల తంతు సీసీ కెమెరాల్లో కూడా వీరికి చిక్కినట్టు ఇందులో పలువురు ప్రముఖుల రాసలీలలు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. స్థానిక పోలీస్‌లు ఒక వైపు డ్రగ్స్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తుండగానే ఇతర శాఖల అధికారులు తమ స్టైల్‌లో దర్యాఫ్తుని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వీరికి చిక్కిన చిట్టాలలో కొం దరు మీడియా ప్రతినిధుల పేర్లు కూడా ఉన్నట్టు వినికిడి.
Hyderabad Police probe continue on Radisson Pub