పాటవ పరీక్ష విజయవంతం
బాలాసోర్ : భారతదేశం శుక్రవారం విజయవంతంగా ఎస్‌ఎఫ్‌డిఆర్ శక్తివంతపు క్షిపణి వ్యవస్థను పరీక్షించింది. ఒడిషా తీర ప్రాంతంలోని బాలాసోర్ ప్రయోగ స్థలి నుంచి దీని పాటవాన్ని పరిశీలించారు. విజయవంతం అయినట్లు నిర్థారించారు. బాలాసోర్‌లోని సమీకృత పరీక్ష కేంద్రం (ఐటిఆర్)వేదికగా ఈ పాటవ పరీక్ష జరిగింది. భారీ స్థాయి ఇంధన సామర్థం ఈ క్షిపణి వ్యవస్థ ప్రత్యేకత, లక్షాన్ని నిర్థిష్టంగా ఎంచుకుని శత్రువును దెబ్బతీసేందుకు ఈ మిస్సైల్ సిస్టమ్ ఉపకరిస్తుంది. అత్యంత దూర లక్షాన్ని కూడా ఈ వ్యవస్థతో శబ్ధవేగాన్ని మించిన వేగంతో దెబ్బతీసేలా ఈ మిస్సైల్ సిస్టమ్ రూపకల్పన జరిగిందని భారత రక్షణ అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) శుక్రవారం ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌లోని డిఆర్‌డిఒ, ఇమారత్ కేంద్రాలలో సంయుక్తంగా ఈ సిస్టమ్‌ను రూపొందించారు. ఇప్పుడు దీని పనితీరు, సమర్థతల పరీక్ష జరిగింది.