రూ.5 వేలకు మించి విత్‌డ్రా చేయరాదు
ముంబై : నిబంధనలను పాటించని బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరడా ఝళిపిస్తోంది. గత నెలలో సుమారు 8 బ్యాంకుల ఆపరేషన్స్ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా మార్గ దర్శకాలను పాటించని బెంగళూరుకు చెందిన కోపరేటివ్ బ్యాంకుకు ఆర్‌బిఐ గట్టి షాక్‌ను ఇచ్చింది. బెంగళూరుకు చెందిన కోఆపరేటివ్ బ్యాంకు శుశ్రుతి సౌహార్ధ సహకార బ్యాంకు నియమిత నిబంధనలను అతిక్రమించినట్లుగా ఆర్‌బిఐ గుర్తించింది. అందుకుగాను ఈ బ్యాంకు ఖాతాదారుల విత్ డ్రా పై ఆంక్షలను విధించింది. ఈ బ్యాంకు ఖాతాదారులు రూ.5 వేలకు మించి విత్ డ్రా చేసుకోవడానికి వీలు లేకుండా చేసింది. అంతేకాకుండా తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఈ బ్యాంకు నుంచి రుణాలను, డిపాజిట్లను తీసుకోవద్దని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాంకులో పరిస్థితులు తిరిగి మెరుగుపడేంత వరకు బ్యాంకింగ్ ఆపరేషన్స్‌పై ఆంక్షలు కొనసాగుతాయని ఆర్‌బిఐ వెల్లడించింది. ఆర్‌బిఐ నిర్ణయంతో సదరు బ్యాంకు ఖాతాదారులపై భారీ ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది.