Tuesday, November 26, 2024

మహాత్మా జ్యోతిరావు ఫూలే

- Advertisement -
- Advertisement -

Jyotirao Phule birth anniversary

మహాత్మా జ్యోతిరావు గోవిందరావు ఫూలే సామాజిక విప్లవ పితామహుడు. అస్పృశ్యుల సామాజిక పరివర్తనకు, సమగ్ర అభివృద్ధికి కృషి చేశారు. అత్యంత ప్రభావశీల రైతు నాయకుడు, పితృస్వామ్య నిరసనకారుడు. కులవ్యవస్థపై తిరగబడ్డ, ‘క్రాంతి సూర్య’గా పేరుబడ్డ సంస్కర్త. శూద్రుల, మహిళల ఆశాజ్యోతి. ప్రతీకార, ప్రతిఘాత శక్తులను, సనాతన సంప్రదాయవాదాన్ని చీల్చిచెండాడారు. జ్యోతిరావు పూర్వీకులు మహారాష్ట్ర సతారా జిల్లా ఖాతావ్ తాలూకా కట్గూన్ గ్రామానికి చెందిన మాలి కులస్థులు. మాలి దళితుల్లో పైమెట్టు కులం. నేడు ఇతర వెనుకబడిన కులం (ఒబిసి). వారి ఇంటి పేరు గోహ్రే. జ్యోతిరావు ముత్తాత కోండిబా గోహ్రే గ్రామ చౌగుల (గ్రామాధికారి కార్యాలయ చపరాసి). కోండిబా కట్గూన్ వదిలి పుణె జిల్లా పురందర్ తాలూకా ఖానావాడి గ్రామంచేరారు. కోండిబా కొడుకు షేతిబా పూనా (పుణె)చేరారు. హిందు రాజులు పేష్వాల ఆస్థానంలో పూల వస్తువులు చేసేవాడు. దీనితో ఫూలే (పూల మనిషి) అన్న ఇంటి పేరు వచ్చింది.

షేతిబాకు ముగ్గురు కొడుకులు- రానోజి, కృష్ణ, గోవింద్. గోవింద్ పుణె దగ్గర కావడి గ్రామస్థుడైన జగడే పాటిల్ కూతురు చిమనాబాయిని పెళ్ళాడారు. వీరికి ఇద్దరు కొడుకులు- రాజారామ్, జ్యోతి. చిన్నవాడు జ్యోతిరావు 11.04.1827 న జన్మించారు. మిత్రులు, ప్రజలు జ్యోతిరావును జ్యోతిబా అనేవారు. ‘బా’ గౌరవ మర్యాదలను, ప్రేమాభిమానాలను సూచిస్తుంది.జ్యోతిరావు చదువురాని వారు పలకడానికి వీలుగా పేరును జోతిరావుగా మార్చుకున్నారు. జోతిబా గా పేరు పొందారు. ఆ కాలంలో బ్రాహ్మణులు పాఠశాలల్లో తమ కులస్థులకే చదువు చెప్పేవారు. దళితులను రానిచ్చినా వేరుగా కూర్చోబెట్టేవారు. 1834-38 మధ్య జోతిబా ప్రాథమిక విద్య ముగిసింది. బ్రాహ్మణత్వ కుతంత్రాలతో బడి మానిన జోతిబా వ్యవసాయంలోమునిగారు. పూల కొట్టులోనూ పని చేసేవారు. ఈ దశలో 1840లో సతారా జిల్లా ఖండాలా తాలూకా నార్గావ్ గ్రామస్థుడు ఖండోజీ నెవషె పాటిల్ కుమార్తె సావిత్రిబాయితో, ఆనాటి ఆచారం ప్రకారం అతి చిన్న వయసులో, జోతిబా పెళ్లి అయింది. పెళ్లి నాటికి జోతిబా వయసు 13, సావిత్రిబాయికి 9 ఏళ్లు. సావిత్రిబాయి నిరక్షరాస్యురాలు. అందుకు వెనుకబడిన కులం, మహిళ కావడం కారణం.

జోతి ఉత్సాహం గమనించిన పర్షియన్ పండితుడు మున్షీ గఫార్ బేగ్, బ్రిటిష్ ఉద్యోగి లిజిత్ సాహబ్‌లు జోతి బంగారు భవిష్యత్తుకు చదువు అవసరమని తండ్రి కి నచ్చజెప్పారు. 1841లో మూడేళ్ల విరామం తర్వాత 14 ఏళ్ల వయసులో జోతి స్కాటిష్ మిషనరి బడిలో చేరారు. అక్కడ ఏడు వరకు చదివారు. బడిలో, ఆంగ్లో అమెరికన్ రాజకీయ సిద్ధాంతవేత్త, తాత్వికుడు, విప్లవకారి థామస్ పెయిన్ పుస్తకం ‘మనిషి హక్కులు’ చదివారు. ఈ పుస్తకం సామాజిక పరివర్తనా దృష్టి కలిగించింది. జోతిబా ముస్లిం పిల్లలతో ఆడేవారు. వారి సాంగత్యంలో మత వంచన, కపట నైపుణ్యతల తప్పుడు ప్రచారాలు, మూఢ నమ్మకాలు తెలిశాయి. క్రైస్తవ మిషనరీల పరిచయంతో ఫూలే జ్ఞానం పెరిగింది. వలసవాద యంత్రాంగంలో బ్రాహ్మణుల బంధుప్రీతి, అవినీతి అనుభవానికి వచ్చాయి.

1848లో జోతిబా జీవితంలో దుస్సంఘటన జరిగింది. ఒక మిత్రుని పెళ్ళిలో ఉన్నత కులస్థులు కులం పేరుతో అవమానించారు. ఈ ఘటనతో శూద్రుల, అతిశూద్రుల విముక్తికి విద్య ఆయుధమని జోతి గుర్తించారు. 1848లోనే దళిత బాలికలకు, స్త్రీలకు పాఠశాలలు ప్రారంభించారు. బాలికలకు, స్త్రీలకు, దళితులకు పాఠశాలలు ప్రారంభించిన తొలి భారతీయుడు జ్యోతిరావు. జోతిబా దంపతులు వితంతు వివాహాలను ప్రోత్సహించారు. దేవదాసీ, సతీ సహగమన దురాచారాలకు వ్యతిరేకంగా, రైతు పన్నుల రద్దుకు, సాగునీటి కాలువల నిర్మాణానికి, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు నడిపారు. బ్రాహ్మణ వితంతువులకు గుండు గీయవద్దని క్షురకులకు నచ్చజెప్పారు. బ్రాహ్మణ వడ్డీ వ్యాపారుల ఉచ్చులో పడకుండా రైతులను చైతన్యపరిచారు. మానభంగాలకు గురయిన వితంతు గర్భవతులసురక్షిత ప్రసవాలకు, వారి పిల్లల సంరక్షణకు ‘శిశుహత్య నిరోధక కేంద్రాలు’ ప్రారంభించారు. వితంతువులు, నిరాధార బాలల పోషణకు ఆశ్రమాలు ప్రారంభించారు. విద్యా హక్కు గురించి ప్రచారం చేశారు. ప్రభుత్వాలపై వత్తిడి తెచ్చారు.

బడిమానే పిల్లల సంఖ్య తగ్గించడానికి విద్యార్థులకు భోజన, గృహ వసతులు కల్పించారు. విద్యార్థి వేతనాలు ఇచ్చారు. పోషకాహార లోపాలు అరికట్టడానికి పిల్లలకు సమతుల ఆహారం అందించారు. తమ పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. పిల్లలకు చిత్రలేఖనం, కళలు నేర్పారు. తల్లిదండ్రుల -ఉపాధ్యాయుల సమావేశాలు జరిపారు. పిల్లల మానసిక వికాసంపై దృష్టి కేంద్రీకరించారు. రైతులు, దళితులు, వెనుకబడిన తరగతులవారు, వారి పిల్లలు, కార్మికుల కోసం రాత్రిబడులు ప్రారంభించారు. మాంగ్స్, మహార్స్‌లు, దళితుల కోసం 1850లో ‘ద నేటివ్ ఫిమేల్ స్కూల్ ఆఫ్ పుణె’, ‘సొసైటి ఫార్ ప్రమోటింగ్ ఎజుకేషన్ ఆఫ్ మహార్స్, మాంగ్స్ ఎట్సెట్ర’ పేర్లతో 2 విద్యాసంస్థలు స్థాపించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో జనాభా ప్రాతిపదికన ప్రతి కులానికి ప్రాతినిధ్యం కోసం ఉద్యమాలు నిర్వహించారు. మద్యపానం పేద కుటుంబాలను సర్వనాశనం చేస్తుందనేవారు జోతిబా. ఎక్కువ సారా దుకాణాలకు అనుమతులు ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఖండించారు.

బ్రాహ్మణత్వ ఆధిపత్య వ్యతిరేక ఉద్యమాల నిర్మాణానికి ఫూలే 1873లో సత్యశోధక సమాజ్‌ను స్థాపించారు. ఇది బ్రాహ్మణత్వ ఆచారాలు, ఛాందసభావాలు, విగ్రహారాధన, కుల వ్యవస్థలకు వ్యతిరేకంగా శూద్రులను చైతన్య పరిచింది. సాంస్కృతిక నిరసనలను, కట్నకానుకలు, పూజారులు, మంత్ర శ్లోకాలు లేని నిరాడంబర పెళ్ళిళ్ళను, కులాంతర, వితంతు వివాహాలను ప్రోత్సహించింది.మతాచారాల్లో పూజారుల అవసరాన్ని, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని, బాల్యవివాహాలను ధిక్కరించింది. స్త్రీలు, శూద్రులు, దళితులకు విద్య, సమానత్వం, సామాజిక హక్కులు నేర్పింది. రాజకీయ ప్రవేశం కల్పించింది. 16.11.1852న బ్రిటిష్ ప్రభుత్వం జోతిబాను సన్మానించింది.11.05.1888న మరొక సంఘ సంస్కర్త విఠల్ రావు కృష్ణాజి వడ్నేకర్ జోతిబాను మహాత్మా బిరుదుతో సత్కరించారు. 21.05.1888న షష్టిపూర్తి వేడుకల్లో రావుబహదూర్ బేడేకర్ ఆ బిరుదు ప్రదానం చేశారు. మహారాష్ట్ర సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫూలే ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు. ప్రభుత్వం జ్యోతిబాను 1876-82 మధ్య పుణె నగరపాలక సంస్థ సభ్యునిగా నియమించింది. జోతిబా తన సంపాదనంతా విద్యాలయాలకు, సేవా సంస్థలకు, సామాజిక కార్యక్రమాలకు ఖర్చుపెట్టారు. చివరికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన ఆరోగ్య చికిత్సకు కూడా డబ్బు లేదు.

జోతిబా ప్రజల సమాచారం కోసం అనేక నాటకాలు, పుస్తకాలు, పద్యాలు, కవితలు, గేయాలు,‘వ్యవసాయదారుని కొరడాతాడు’ పుస్తకం రాశారు. ప్రచురించి ప్రజలకు పంచారు. ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో, పాడుకోవడానికి అనువైన శైలిలో జానపద గేయాలు ‘పోవాడా’లు రాసి వీటిని పాడుతూ ప్రజలను చైతన్యపరిచేవారు. ‘సత్యధర్మ’ పుస్తకంలో ప్రపంచ మతాల గురించి రాశారు. తాను ఆచరించే ‘సత్య మతం’ మానవతావాద మతమని ప్రశంసించారు.‘గులాంగిరి (బానిసత్వం)’ పుస్తకంలో విదేశీ విద్య, ఆంగ్లం, బ్రాహ్మణత్వం, అమెరికా జాత్యహంకారం, భారత బానిసత్వం, భవిష్యత్ కార్య ప్రణాళిక వగైరా అంశాలు వివరించారు. మార్క్ బోధించినట్లు జాతీయతతో పాటు అంతర్జాతీయతకూ ప్రాధాన్యత ఇచ్చారు. ‘సత్సార్’ (సత్యసారం) పుస్తకంలో బ్రాహ్మణాధిపత్య సంస్థలను తీవ్రంగా విమర్శించారు. దళితులకు సభ్యత్వం ఇవ్వని సార్వజనిక సభ, కాంగ్రెస్ కోరుతున్న పరిపాలన బ్రాహ్మణీయతకు దారితీస్తుందని తన రచనల్లో హెచ్చరించారు. మన అంటరానితనాన్ని అమెరికా జాత్యహంకారంతో సరిపోల్చారు. 1888లో జోతిబాకు పక్షవాతం వచ్చి కుడి చేయి పడిపోయింది. పట్టుదలతో ఎడమ చేతితో రాయడం అలవాటు చేసుకున్నారు. రెండున్నరేళ్ళ తర్వాత జోతిబా మరలా పక్షవాతం బారినపడ్డారు. 2 నెల్ల తర్వాత 28. నవంబర్ 1890న మరణించారు. వివిధ రంగాల్లో సేవ చేసిన మహాదేవ్ గోవింద రానడే, విష్ణుశాస్త్రి చిప్లున్కర్, గోపాల్ గణేశ్ అగార్కర్, ధొండే కేశవ్ కర్వే, పండిత రమాబాయి, గాంధీల కంటే ముందు పుట్టారు ఫూలే. ఆనాటికే దళిత ఉద్ధరణ, దళిత బాలికల, మహిళా విద్య విముక్తి, సామాజిక విప్లవం ఫూలే దంపతుల ప్రత్యేకత. దళితుల కోసం ఫూలే దంపతులు జీవితాలనే త్యాగం చేశారు.

సంగిరెడ్డి హనుమంత రెడ్డి- 9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News