న్యూఢిల్లీ : రష్యాతో ఇంధన వాణిజ్య వ్యవహారాలు కొనసాగిస్తుండటంపై పశ్చిమ దేశాల నుంచి దౌత్యపరంగా తీవ్ర ఒత్తిడిని భారత్ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సోమవారం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని నరేంద్రమోడీ సోమవారం వర్చువల్‌గా చర్చలు జరపనున్నారు. ఉభయదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, దక్షిణాసియా, ఇండో పసిఫిక్ రీజియన్ లోని ఇటీవలి పరిణామాలపై పరస్పర అభిప్రాయ మార్పిడి తదితర అంశాలపై చర్చిస్తారని మీడియా ప్రకటన విడుదలైంది. భారత్, అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక, సమగ్ర, భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కాడానికి ఈ చర్చలు దోహదం చేస్తాయని అభిప్రాయపడతున్నారు. ఈ చర్చల తరువాత భారత్, అమెరికా దేశాల రక్షణ మంత్రుల స్థాయిలో చర్చలు జరుగుతాయి. భారత్ తరపున కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్, అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులుతో చర్చలు జరుపుతారు.