రామేశ్వరం: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి సామాన్యుడికి అందనంత రూరంలో నిలవడంతో సగటు పౌరుడి జీవనం అగమ్య గోచరంగా మారింది. తినడానికి తిండి లేక, చేయడానికి పని లేక స్వదేశంలో జీవించడమే కష్టంగా మారడంతో అనేక కుటుంబాలు పొట్ట చేత పట్టుకుని దగ్గర్లో ఉన్న భారత్‌కు వలస వస్తున్నాయి. కొద్ది రోజులుగా ఈ వలసలు కొనసాగుతుండగా.. తాజాగా శనివారం 19 మంది శ్రీంక తమిళులు పడవలో తమిళనాడులోని ధనుష్కోటికి చేరుకున్నారు. వీరిలో ఆరుగురు మహిళలు, అయిదుగురు పిల్లలు ఉన్నారు. ధనుష్కోటి సమీపంలోని అరిసాల్మునై ప్రాంతానికి వీరు చేరుకున్నారని సమాచారం అందడంతో మెరైన్ పోలీసులతో పాటుగా పోలీసులు అక్కడికి చేరుకుని వారిని మండపం క్యాంప్‌కు తరలించారు. ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో జీవించడం కష్టంగా మారిందని వారంతా చెప్పుకొచ్చారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మొదలైన సమయంలో పదిమంది అక్కడినుంచి తమిళనాడుకు వలస వచ్చారు. దీంతో ఇప్పటివరకు 29 మంది తమిళనాడుకు అక్కడినుంచి వచ్చారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. శ్రీలంకలో అధ్యక్షుడు గోటబయ రాజపక్సకు వ్యతిరేకంగా జనం వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.