ఇస్లామాబాద్ : పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్) నుంచి వైదొలగాలని ఇమ్రాన్ ఖాన్ నాయకత్వపు పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ (పిటిఐ) ఆదివారం నిర్ణయించింది. సభలో ఇమ్రాన్‌ఖాన్ ఘోరంగా ఓడారు. తరువాత పరిస్థితిని సమీక్షించుకునేందుకు పార్టీ భేటీ జరిగింది. పాకిస్థాన్ 1947లో స్వాతంత్య్ర దేశం అయింది. అయితే ఇప్పుడే దేశంలో స్వాతంత్య్ర ఉద్యమం ఆరంభం అయిందని పార్టీ నేత ఇమ్రాన్ తెలిపారు. తమ ప్రభుత్వ పతనానికి విదేశీ కుట్ర జరిగిందని పేర్కొంటూ దీనికి వ్యతిరేకంగా తమ పోరు సాగుతుందని ప్రకటించారు. దేశ ప్రజలు ఎల్లవేళలా తమ సర్వసత్తాకత, ప్రజాస్వామ్య ఘనతను కాపాడుకుంటూ వస్తున్నారని, ఇకపై కూడా ఇదే జరుగుతుందని తెలిపారు. పిటిఐ కేంద్ర ప్రధాన కార్యనిర్వాహక కమిటీ భేటీ బనీ గలాలో ఇమ్రాన్ అధ్యక్షతన జరిగింది. భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించుకున్నారు. సోమవారం తమ పార్టీ జాతీయ అసెంబ్లీ నుంచి వైదొలుగుతుందని పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఫవాద్ చౌదరి విలేకరులకు తెలిపారు. ప్రధాని పదవికి పిఎంఎల్ ఎన్ అధ్యక్షులు షెహబాజ్ షరీప్ నామినేషన్ పట్ల తమ వ్యతిరేకతను పరిశీలించకపోతే తమ స్పందన తీవ్రంగా ఉంటుందని పిటిఐ హెచ్చరించిందని పాకిస్థాన్ వార్తాసంస్థలు తెలిపాయి.