ముగ్గురు నానీలకు మంగళం..
10 మంది పాతమంత్రులకు మళ్లీ అవకాశం
మంత్రివర్గంలో నలుగురు మహిళలు బిసిలంటే బ్యాక్‌వర్డ్ కాదు.. బ్యాక్‌బోన్: సజ్జల
పదవులు దక్కని వారి ఆందోళనలు, నిరసనలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం సోమవారం నాడు కొలువుదీరనుంది. గత మూడురోజులుగా దీనిపై కసరత్తు చేసిన సిఎం జగన్ ఆదివారం సాయంత్రం తుదిజాబితాను ఖరారు చేశారు. మరోవైపు మంత్రులుగా ఎంపిక చేసిన వారికి సిఎం కార్యాలయ అధికారులు ఫోన్ చేసి సమాచారాన్ని తెలిపారు. ఈక్రమంలో సోమవారం ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కనే ఉన్న పార్కింగ్ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.కాగా కొత్త కేబినెట్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా పాత మంత్రుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నూతన జాబితాలోని 25 మంది మంత్రులను ఆమోదించారు. అయితే రాజీనామాల ఆమోదంపై అధికారిక ప్రకటన వెలువరించారు.
సీనియర్లకు మళ్లీ అవకాశం
ఎపిలో సీనియర్‌లకు మరోసారి మంత్రి పదవి లభించింది. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరి జయరాం, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన సత్యనారాయణ, వేణుగోపాల కృష్ణ, పినిపె విశ్వరూప్,తానేటి వనిత, నారాయణస్వామి, అంజాద్‌బాషాలకు రెండో సారి మంత్రి పదవి అవకాశం దక్కింది. ఈక్రమంలో రెండవ విడతలో 15మంది ఎంఎల్‌ఎలకు మంత్రి పదవి దక్కింది.
బిసిలంటే బ్యాక్‌వార్డ్ కాదు..బ్యాక్ బోన్ ః సజ్జల
బిసిలంటే బ్యాక్‌వార్డ్ క్లాస్ కాదు బ్యాక్‌బోన్ క్లాస్ మరోసారి ఎపి సిఎం జగన్ నిరూపించాడని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎపి సిఎం వైఎస్ జగన్ మొదటి కేబినెట్ సామాజిక విప్లవం. ఇప్పుడు కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ద్వారా సామాజిక మహావిప్లవం. చరిత్రలో ఎన్నడూలేని విధంగా బిసి, ఎస్‌సి,ఎస్‌టి, మైనార్టీలకు పెద్దపీట వేశారన్నారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం పాటించారని, అన్ని రంగాల్లోనూ బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. సిఎం జగన్ తొలి కేబినెట్‌లో 14 మంది బిసి, ఎస్‌సి,ఎస్‌టి, మైనార్టీలకు చోటిచ్చారని, ఈ సారి 25 మందిలో 70 శాతం బడుగు బలహీనవర్గాలే ఉన్నారన్నారు. మొదటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ వర్గాలకు పెద్దపీట వేస్తోందన్నారు. గతంలో కేబినెట్‌లో ముగ్గురు మహిళలుండగా ఈసారి నలుగురికి అవకాశం ఇచ్చామన్నారు. ఇది ఎన్నికల కోసం చేసిన కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ కాదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదట నుంచి బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలకు పెద్దపీట వేస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
అశావాహుల ఆందోళనలు..నిరసనలు ః
కొత్త కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో పలువురు ఆశావాహుల అనుచరులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేశ్‌ను మంత్రివర్గంలో కొనసాగించి, తనను తొలగించిన నేపథ్యంలో బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. స్వయంగా సజ్జల బాలినేని ఇంటికి వెళ్లి చర్చలు జరపినా ఆయన చల్లారలేదని తెలుస్తోంది. మరోవైపు బాలినేని అనుచరులు, మద్దతుదారులు ఆయన నివాసం వద్దకు చేరుకుని శ్రీనివాసులురెడ్డిని మంత్రివర్గంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల ఎంఎల్‌ఎ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి.. మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు వరుసగా ఎంఎల్‌ఎగా గెలిచినా రామకృష్ణారెడ్డి విషయంలో సర్కారు మొండిచేయి చూపడంపై మండిపడ్డారు. మాచర్ల రింగు రోడ్డులో ద్విచక్రవాహనం, టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. మంత్రి పదవి రాకపోవడంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు. పార్టీకి రాజీనామా చేద్దామని వైఎస్సార్ కొర్పొరేటర్లు, మండల నాయకులు నినాదాలు చేశారు. విజయవాడ బందరు రోడ్డులో వైకాపా శ్రేణులు కొలుసు పార్థసారధి వర్గీయులు ఆందోళన చేపట్టారు. ఎన్‌టిఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఎంఎల్‌ఎ సామినేని ఉదయభాను అనుచరులు ముళ్లపాడు అడ్డరోడ్డు వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. పెట్రోల్‌పోసి ద్విచక్రవాహనాన్ని తగులబెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తలకు మంటలు అంటుకున్నాయి. వారిద్దరూ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
ముగ్గురు నానీలకు ఉద్వాసన ః
ఎపిలో కొడాలి నాని, పేర్నినాని, ఆళ్ల నానిల పదవులకు ఎపి సిఎం ఉద్వాసన పలికారు. గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నానికి తాజాగా ఎపి స్టేట్ డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా అవకాశం కల్పించనున్నారు. కేబినెట్ హోదాలో ఆయనకు రాష్ట్ర అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించనున్నారు. ఎపి డిప్యూటి సిఎంగా ఆళ్లనాని, పేర్ని నానిలకు ఏలాంటా బాధ్యతలు అప్పగించలేదు.
నూతన మంత్రి వర్గం జాబితా
పేరు జిల్లా సామాజికవర్గం
ధర్మన ప్రసాద రావు శ్రీకాకుళం వెలమ
సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం మత్స్యకార
బొత్స సత్యనారాయణ విజయనగరం తూర్పు కాపు
రాజన్న దొర పార్వతీపురం ఎస్‌టి
గుడివాడ అమర్నాధ్ అనకాపల్లి కాపు
ముత్యాలనాయుడు అనకాపల్లి కొప్పుల వెలమ
దాడిశెట్టి రాజా కాకినాడ కాపు
పినిపె విశ్వరూప్ కోనసీమ ఎస్‌టి
చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ కోనసీమ బిసి – శెట్టి బలిజ
తానేటి వనిత తూర్పుగోదావరి మాదిగ – ఎస్‌సి
కారుమూరి నాగేశ్వరరావు పశ్చిమ గోదావరి యాదవ – బిసి
కొట్టు సత్యనారాయణ పశ్చిమ గోదావరి కాపు
జోగి రమేష్ కృష్ణా గౌడ్ – బిసి
అంబటి రాంబాబు పల్నాడు కాపు
మేరుగ నాగార్జున బాపట్ల ఎస్‌సి
విడదల రజని గుంటూరు బిసి
కాకాణి గోవర్దన్ రెడ్డి నెల్లూరు ఒసి – రెడ్డి
అంజద్ బాషా కడప మైనార్టీ
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నంద్యాల ఒసి – రెడ్డి
గుమ్మనూరు జయరాం కర్నూలు – బోయ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు ఒసి – రెడ్డి
నారాయణ స్వామి చిత్తూరు ఎస్‌సి
ఆర్ కె రోజా చిత్తూరు ఒసి- రెడ్డి
ఉషా శ్రీ చరణ్ అనంతపురం కురుమ- బిసి
ఆదిమూలపు సురేశ్ ప్రకాశం ఎస్‌సి
చీఫ్ విప్‌గా ప్రసాదరాజు
డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి
ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా మల్లాది విష్ణు