నోయిడాలో కలకలం
90కి చేరిన యాక్టివ్ కేసులు
ముమ్మర స్థాయిలో పరీక్షలు
నోయిడా : ఢిల్లీ శివార్లలోని నోయిడాలో కొవిడ్ కేసులు కలకలం రేకెత్తించింది. మరో పది మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. దీనితో ఈ యుపి నగరంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 90కి చేరుకుంది. పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున వైరస్ నిర్థారణ పరీక్షలు చేపట్టారు. స్థానిక గౌతమ్ బుద్ధ నగర్ ఆరోగ్య విభాగం ఓ ప్రకటన వెలువరించింది. తమ పరీక్షలలో మరో 33 మంది వైరస్ బారిన పడినట్లు స్పష్టం అయిందని తెలిపారు. వీరిలో పది మంది పిల్లలు కూడా ఉన్నారు. దీనితో ఇప్పటివరకూ వైరస్ బారిన పడ్డ పిల్లల సంఖ్య ఈ వారంలో 20కి చేరింది. ఈ పరిణామంతో తల్లిదండ్రులలో భయాందోళనలు పట్టుకున్నాయి. ఎక్కువ జనసాంద్రత గల నోయిడాలో వైరస్ వ్యాపించినట్లు నిర్థారణ కావడం, ఇది ఢిల్లీకి సమీపంలోనే ఉండటంతో అధికారులు అన్ని నివారణ చర్యలను ఉధృతం చేశారు. ఇక్కడ ఇటీవలి కాలంలో యాక్టివ్ కేసుల సంఖ్య మొత్తం మీద 90కి చేరింది. విద్యార్థులు స్కూలు పిల్లలని , అయితే వారి స్కూళ్లలో కొవిడ్ పరీక్షలు జరిగిందీ లేనిదీ తెలియలేదని, పాఠశాలల నుంచి సమాచారం తెప్పిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖాధికారులు తెలిపారు.