బెంగళూరు : కర్ణాటకలో ఇటీవల వెలుగు చూసిన 40 శాతం కమిషన్ వ్యవహారం బిజెపి ప్రభుత్వాన్ని కుదిపోస్తోంది. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ అనుమానాస్పద మృతి వ్యవహారంలో చిక్కుల్లో పడిన కర్ణాటక గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై బుధవారం ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసులో మొదటి నిందితుడిగా ఆయన పేరున్నట్టు మంగళూర్ పోలీసులు తెలిపారు. సంతోష్ పాటిల్ సోదరుడు ప్రశాంత్ పాటిల్ ఇచ్చిన ఫిర్యాదుపై సివిల్ కాంట్రాక్టర్ ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగాలపై ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు చెప్పారు. తన చావుకు మంత్రి ఈశ్వరప్ప కారణమని పేర్కొంటూ సంతోష్ పాటిల్ అనే ఓ సివిల్ కాంట్రాక్టర్ ఇటీవల ఉడిపి హోటల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆశయాలను పక్కనబెట్టి ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రితోపాటు బిజెపి నేత యడియూరప్పలు తన కుటుంబాన్ని ఆదుకోవాలని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
ఉడిపి హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో సంతోష్ పాటిల్ మంగళవారం మృతి చెందడం సంచలనమైంది. ఈశ్వరప్పతోపాటు ఆయన సిబ్బంది రమేష్, బసవరాజ్ నిందితులంటూ తన ఫిర్యాదులో ప్రశాంత్ పేర్కొన్నారు. హిండలగ గ్రామంలో రూ. 4 కోట్లు విలువ చేసే పనులను తన సోదరుడు చేశాడని, ఆ పనులకు సొంత డబ్బులు ఖర్చు చేయగా, బిల్లులు పెండింగ్‌లో ఉంచారని ఆయన తెలిపారు. సొమ్ములు విడుదల చేయాలని ఈశ్వరప్పను పలుమార్లు సంతోష్ కలిపి విజ్ఞప్తి చేశారని, అయితే ఆయన సహచరులైన బసవరాజ్, రమేష్‌లు 40 శాతం కమిషన్ అడిగారని సంతోష్ పాటిల్ సోదరుడు ప్రశాంత్ పాటిల్ ఆరోపించారు. ఇదిలా ఉండగా పాటిల్ ఆత్మహత్య చేసుకున్న ప్రాంతానికి ఫోరెన్సిక్ బృందం చేరుకుని సాక్షాలను పరిశీలిస్తోంది. పాటిల్ అనుమానాస్పద మృతి సంచలనం కావడంతో ఈశ్వరప్పను మంత్రి పదవి నుంచి తప్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈశ్వరప్పను గవర్నర్ తొలగించాలని, అతన్ని అరెస్టు చేయాలని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ బుధవారం డిమాండ్ చేశారు. తన సొంత మనుషులతో 40 శాతం కమిషన్‌కు డిమాండ్ చేసిన మంత్రిపై అవినీతి కేసు నమోదు చేయాలన్నారు. ఇదిలా ఉంటే 40 శాతం కమిషన్ వ్యవహారంపై కర్ణాటక లోని కాంట్రాక్టర్ల సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వివిధ అభివృద్ది పనులకు సంబంధించి ప్రజాప్రతినిధులను సమర్పించాల్సిన కమిషన్‌పై ప్రధాని నరేంద్రమోడీకి ఇటీవలే ఫిర్యాదు చేశాయి.
కాంట్రాక్టర్ సంతోష్‌ను చూడలేదు : ఈశ్వరప్ప
తనపై కాంట్రాక్టర్ సంతోష్ చేసిన ఆరోపణలపై మంత్రి ఈశ్వరప్ప బుధవారం స్పందించారు. అసలు తాను కాంట్రాక్టర్ సంతోష్‌ను ఎప్పుడూ చూడలేదని, ఆయనను ఎప్పుడూ కలుసుకోలేదని, ఈశ్వరప్ప స్పష్టం చేశారు. కేంద్రానికి అతను రాసిన లేఖ మా శాఖ పరిశీలనకు వచ్చింది. దీనిపై మా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అతీఖ్ అహ్మద్ సమాధానమిచ్చారు. ఆయనకు సివిల్ కాంట్రాక్ట్ పనులు అప్పగించినట్టు మా రికార్డుల్లో లేవు. అలాంటప్పుడు నగదు చెల్లింపుల సమస్యే ఉత్పన్నం కాదు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి కూడా మేం తీసుకెళ్లాం అని మంత్రి ఈశ్వరప్ప వివరించారు. తనపై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాత దర్యాప్తు చేయాలని సీఎం బొమ్మైని, హోం మంత్రిని విజ్ఞప్తి చేశానని మంత్రి ఈశ్వరప్ప వివరణ ఇచ్చారు.