Friday, December 20, 2024

ఉక్రెయిన్‌లో రష్యా సాగిస్తోంది నరమేథమే : బైడెన్

- Advertisement -
- Advertisement -

Russia's genocide in Ukraine:Biden

 

డెస్ మొయినెస్ (లోవా): ఉక్రెయిన్‌లో రష్యా సైనికుల అరాచకాలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలిసారి నరమేథంతో పోల్చారు. గతంలో జో బైడెన్ ఈ పదం వాడేందుకు ఇష్టపడలేదు. కానీ రష్యా దళాలు దాడులు చేసి వెనుదిరిగిన తరువాత ఆయా నగరాల్లో భయానక దృశ్యాలు వెలుగు లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జో బైడెన్ తీవ్రంగా స్పందించారు. ‘ నేను దానిని నరమేథమే అంటాను. ఎందుకంటే అసలు ఉక్రెయిన్ ఉన్నదన్న ఆలోచనను కూడా కూకటి వేళ్లతో సహా పెకలించేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయత్నిస్తున్నారు. గత వారంలో ఉన్న పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి చాలా తేడా కనిపిస్తోంది. ఉక్రెయిన్‌లో రష్యాదళాల బీభత్సం సృష్టించాయి. మనం భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని చూస్తాం. నా దృష్టిలో ఇది ఓ నరమేథమే అని బైడెన్ విలేఖరులతో అన్నారు. గతంలో బైడెన్ ఉక్రెయిన్‌పై రష్యా దళాల చర్యలను యుద్ధ నేరాలుగానే పేర్కొన్నారు. కానీ తాజాగా “నరమేథం” పదం వాడటం విశేషం. ఉక్రెయిన్ సంక్షోభంపై అమెరికా దృష్టి కోణంలో నాటకీయమైన మార్పులు వస్తోన్న విషయాన్ని ఈ అంశం వెల్లడిస్తోంది.

బైడెన్ భావోద్వేగాలతో స్పందిస్తూ ఈ సంక్షోభంపై అమెరికా పాలసీలో వేగంగా మార్పులు చేస్తున్నారు. రష్యా దళాల క్రూరత్వంపై అమెరికా లోని చాలా మంది అభిప్రాయాలకు ప్రతీకగా బైడెన్ నిలుస్తున్నారు. ఇదివరకటి అమెరికా నేతలు ఉక్రెయిన్‌లో రష్యా నరమేథం వంటి సంఘటనలు జరిగితే నరమేథం అని ప్రకటించడానికి వెనుకాడే వారు. రువాండాలో 1994 ఏప్రిల్ నుంచి జులై వరకు దాదాపు వంద రోజులపాటు ఊచకోత జరిగింది. రువాండా లోని మెజార్టీ హుటు తీవ్రవాద వర్గాలు మైనార్టీ టుట్సి వర్గాలను హత్య చేయడంతో దాదాపు 8 లక్షల మంది ఊచకోతకు గురయ్యారు.అయినా ఆనాటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ దాన్ని నరమేథంగా ప్రకటించలేక పోయారు. కానీ ఇప్పుడు బైడెన్ హయాంలో అమెరికా నేతల వైఖరి మారింది. బైడెన్ స్పందనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నుంచి మద్దతు లభించింది. నిజమైన నాయకుడి నుంచి నిజమైన వ్యాఖ్యలని బైడెన్‌ను జెలెన్‌స్కీ ప్రశంసించారు. ఓ దుష్ట శక్తికి వ్యతిరేకంగా పోరాటంలో జరిగిన ఘటనలను వాటి పేర్లతో పిలవడం చాలా అవసరం. అమెరికా సాయానికి కృతజ్ఞతతో ఉంటాం. రష్యన్లను అడ్డుకోవడానికి మరిన్ని భారీ ఆయుధాలు కావాలి అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News