వాషింగ్టన్: అమెరికాలో పర్యటించిన భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ ప్రతి విషయంలోనూ భారత వైఖరిని స్పష్టంగా తెలిపారు. భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ అమెరికా చేసిన వ్యాఖ్యలకు తగిన విధంగా జవాబిచ్చారు. వాషింగ్టన్‌లో భారత్, అమెరికాల మధ్య 2+2 చర్చలు జరిగాయి. ఆ సందర్భంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకన్ ‘భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరుగుతుండడాన్ని గమనించామన్నారు. వీటికి ముగింపు పలికే వరకు ఈ అంశంపై నిరంతరం ఇరు దేశాలు సంప్రదింపులు జరుపుతుండాలన్నారు. కాగా తన పర్యటన ముగింపు దశలో దీనిపై జై శంకర్ ప్రతిస్పందించారు. అక్కడి పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ అసలు 2+2 సమావేశంలో మానవ హక్కుల ఉల్లంఘన అంశమే ప్రస్తావనకు రాలేదన్నారు. ‘మానవ హక్కుల ఉల్లంఘనపై మా మధ్య చర్చ జరగలేదు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, ఇండోపసిఫిక్ అంశాలు, పాకిస్థాన్ నాయకత్వ మార్పు, శ్రీలంక సంక్షోభం, ప్రపంచ దేశాల ఆహార భద్రత వంటి అంశాలపై చర్చించాం. భారత్‌పై ఓ అభిప్రాయాన్ని కలిగి ఉందేందుకు ప్రతి ఒక్కరూ అర్హులు. అలాగే వారి విషయంలోనూ మేము ఓ అభిప్రాయాన్ని కలిగి ఉంటాము. అమెరికా సహా ఇతర దేశాల మానవ హక్కుల పరిస్థితిపై కూడా మా అభిప్రాయాలు మాకుంటాయి. అమెరికాలో మానవ హక్కుల సమస్య తలెత్తినప్పుడు, అది కూడా మన సమూహానికి చెందినప్పుడు మేము వాటిని కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాం’ అని ఆయన అన్నారు.
#India too has views on #HumanRights situation in #US: EAM Jaishankar's sharp retort to US concerns https://t.co/5AbkTtMZCO pic.twitter.com/mU2Dhw8XUN
— Economic Times (@EconomicTimes) April 14, 2022