బెంగళూరు : కర్ణాటకలో ఈ నెల 22 నుంచి పీయూ రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్న సమయంలో మరోసారి హిజాబ్ వివాదం తెరపైకి వచ్చింది. విద్యార్థులను హిజాబ్ ధరించి పరీక్షలు రాసేందుకు అనుమతించాలని ఈ కేసు పిటిషనర్లలో ఒకరైన న్యాయవాది అలియా అస్సాదీ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రిని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. విద్యార్థుల భవిష్యత్ నాశనం కాకుండా చూసేందుకు మీకు ఇంకా అవకాశం ఉంది. హిజాబ్ ధరించి పరీక్షలు రాయడానికి వారిని అనుమతించండి. దయచేసి ఈ విజ్ఞప్తిని పరిగణన లోకి తీసుకోండి అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరంలో ఉడుపి లోని ప్రభుత్వ పీయూ కళాశాలలో ఈ హిజాబ్ వివాదం మొదలైంది. తరువాత సమీపం లోని కుందాపూర్, బైందూరు లోని మరికొన్ని కళాశాలలకు ఈ వివాదం వ్యాపించింది. హిజాబ్‌ను అనుమతించాలని కోరుతూ విద్యార్థినులు దాఖలు చేసిన అన్ని పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. విద్యాసంస్థల్లో విద్యార్థులంతా ఏకరీతి దుస్తుల నియమాన్ని పాటించాలని తీర్పు చెప్పింది. కోర్టు తీర్పును పాటించక పోతే పరీక్ష రాయడానికి అనుమతించబోమని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
హిజాబ్‌ను అనుమతించాలని మరోసారి అభ్యర్థన
- Advertisement -
- Advertisement -
- Advertisement -