కశ్మీరీ పండిట్లకు బెదిరింపు లేఖ
శ్రీనగర్ : కశ్మీరీ పండిట్లకు ఓ బెదిరింపు లేఖ వెలువడింది. స్థానికేతరులపై దాడులు జరుగుతాయి. పండిట్లను తరిమికొడుతామని పేర్కొంటూ వెలుగులోకి వచ్చిన లేఖ కశ్మీర్ లోయలో కలకలానికి దారితీసింది. నిలకడగా ఉన్న శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు భద్రతా బలగాలు, పోలీసు దళాలు పెద్ద ఎత్తున ఉగ్రవాద నిరోధక చర్యలను ముమ్మరం చేశాయి. అయితే ఇప్పటికీ జరుగుతున్న హింసాత్మక ఘటనలు , అప్రాబల్యపు వర్గాలపై జరిగే దాడులు సవాలుగా మారుతున్నాయి. తాజాగా బారాముల్లాలోని వీరవన్ పండిట్ కాలనీలో కశ్మీరీ పండిట్లను బెదిరిస్తూ లేఖ వచ్చింది.
తమకు ఇది పోస్టు ద్వారా వచ్చిందని పండిట్లు తెలిపారు. పెద్దగా ప్రచారంలో లేని లష్కరే ఏ ఇస్లామ్ పేరిట ఈ లేఖ వచ్చింది. పండిట్లు లోయలోని ముస్లిమేతరులను దెబ్బతీస్తామని లేఖలో హెచ్చరించారు. బారాముల్లా జిల్లాలోనే ఈ లష్కరే ఇస్లామ్ తలెత్తింది. తమకు దేశంలో నుంచే ఈ లేఖ అందిందని దీనిని పండిట్లు స్థానిక భద్రతా బలగాలకు అందించారు. ఈ కాలనీని ఇప్పటికే పారామిలిటరీ బలగాలు కాపలా కాస్తున్నాయి. తమకు భద్రతా పెంచుతామని అధికారులు తెలిపారని అయితే ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియని స్థితి ఉందని పండిట్ల సంఘం అధ్యక్షులు తెలిపారు. ఈ కాలనీలో దాదాపు 350 వరకూ పండిట్ల కుటుంబాలు నివసిస్తున్నాయి.