Monday, December 23, 2024

అభినవ చేగువేరా జార్జిరెడ్డి

- Advertisement -
- Advertisement -

 

 

ఉస్మానియా విశ్వవిద్యాలయ నిప్పుకణం ‘జీనా హైతో మర్నా సీఖో! కదం కదం ఫర్ లడ్ నా సీఖో. జీవించాలంటే మరణం గురించి నేర్చుకో అడుగడుగునా పోరాటం గురించి నేర్చుకో’ అంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కేంద్రంగా ఒక నినాదం పుట్టింది. వేలాది మందిని చైతన్యపరిచి విద్యార్థి ఉద్యమానికి బాటలు వేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎన్నో పుస్తకాలు చదివి విద్యార్థి మేధో మార్గాన్ని తయారు చేసిన అభినవ చేగువేరా, పిడిఎస్‌యు విద్యార్థి వ్యవస్థాపక సంఘ నిర్మాత, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి ఉద్యమాలకు ఆద్యుడు, ప్రముఖ విప్లవకారుడు చేగువేరా స్ఫూర్తిని గుండెలనిండా నింపుకొని భారత పీడిత ప్రజల పక్షాన విద్యార్థి ఉద్యమాల నిర్మాణానికి పూనుకున్న ఉస్మానియా అగ్నికణం.

పుట్టుకతో వృద్ధులుగా జీవించడానికి నిరాకరించి పావన నవజీవన బృందావన నిర్మాతలలో భాగం కావడానికి నిశ్చయించుకున్న స్ఫూర్తి ప్రదాత ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ ధ్రువతార మహోన్నత విద్యార్థి మేధావి జార్జ్‌రెడ్డి. జార్జి రెడ్డి 1947, జనవరి 15న పాల్ఘాట్, కేరళలో చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా రఘునాథరెడ్డి, ట్రావెన్కూరు ప్రాంతానికి చెందిన లీలా వర్గీస్ దంపతులకు జన్మించాడు. ఈయన తలిదండ్రులు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో కలుసుకున్నారు. రఘునాథరెడ్డి బి.ఎ హానర్స్ చేయగా, లీలా వర్గీన్ రసాయన శాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసి ఎంఎ చదివింది. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. పెద్దవాడైన డాన్‌రెడ్డి బి.ఇడీ పూర్తి చేసి, ఒరిస్సాలో స్థిరపడ్డాడు.

రెండవ కొడుకు కార్ల్ రెడ్డి ఐఎఎస్ అధికారి అయ్యాడు. కుమార్తె జాయ్ రెడ్డి భాషా శాస్త్రంలో ఎంఎ చేసి మైసూరులోని భారతీయ భాషా అధ్యయన కేంద్రంలో పని చేసింది.నాలుగవ సంతానం జార్జ్ రెడ్డి, చివరి వాడు సిరిల్ రెడ్డి. జార్జ్ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం బెంగళూరు, చెన్నైలలో సాగింది. ఐదు, ఆరు, ఏడు తరగతులు క్విలాన్ జిల్లా తంగచ్చేరిలోని ఇన్‌ఫెంట్ జీసస్ ఉన్నత పాఠశాలలో, ఎనిమిది, తొమ్మిది తరగతులు చెన్నై ఎగ్మోరులోని డాన్ బాస్కో ఉన్నత పాఠశాలలో చదివాడు. ఆ తరువాత 1961-62లో కాజీపేటలోని సెయింట్ గాబ్రియేల్ ఉన్నత పాఠశాలలో కొన్నాళ్ళు చదివాడు. ఆ తరువాత కుటుంబం హైదరాబాదుకు మారింది. అక్కడ సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తిచేశాడు. నిజాం కళాశాలలో పియుసి (ఇప్పటి ఇంటర్మీడియట్‌తో సమానం) పూర్తి చేశాడు. 1964లో బిఎస్‌సి చేయటానికి ఉస్మానియా విశ్వవిద్యాలయపు సైన్సు కళాశాలలో చేరాడు.

కానీ డిగ్రీ 2, 3 వ సంవత్సరాలు మాత్రం నిజాం కళాశాలలో పూర్తి చేశాడు. హైదరాబాదులోని నిజాం కళాశాలలో బిఎస్‌సి (1964-67) డిగ్రీ చేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్‌లో ఎంఎస్‌సి చేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి చేస్తూ పాక్షిక సమయంలో కొన్ని నెలల పాటు ఎవి కళాశాలలో జూనియర్ లెక్చరర్ గా పని చేశాడు. పిహెచ్‌డికి అనుమతి పొందాడు. జార్జిరెడ్డి బాక్సింగ్ చేసేవాడు. తీవ్రపఠనాసక్తి కలవాడు. తను 25 ఏళ్ల వయసులో మరణించే నాటికి హేగెల్, మార్క్ ఫ్రాయిడ్ రచనలను చదివాడు. భౌతిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం స్వర్ణ పతకాన్ని సాధించాడు. అభ్యుదయ ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య (పిడియస్‌యు)ను స్థాపించాడు. పిడియస్‌యు భారతీయ కమ్యూనిస్టు పార్టీ (ఎంఎల్)కి విద్యార్థి విభాగంగా పని చేస్తుంది. జార్జి తొలుత కాంగ్రెస్ పార్టీలోని యంగ్ టర్క్‌లను అనుసరించాడు. 1969-70ల నుంచి సోవియట్ యూనియన్ అండతో కాంగ్రెస్ పార్టీ పెట్టుబడిదారీ సంస్కరణ పంథా వైపు నడిపించే ప్రయత్నం జరిగింది. అందుకోసం యంగ్ టర్క్‌లు కాంగ్రెస్ పార్టీలో యువ బృందంగా అవతరించింది. ఫ్యూడల్ భూస్వాముల వ్యతిరేకంగా యంగ్ టర్కుల తీవ్రవాద నినాదాలు జార్జిని ఆకర్షించాయి.

వారు ‘సోషలిస్టు స్టడీ ఫోరం’ గా ఏర్పడి సాగించిన ప్రచారాన్ని చిత్తశుద్ధిగా నమ్మాడు. తన స్నేహితుడు కె. శ్రీనాథ్ రెడ్డి తండ్రి, కేంద్ర మంత్రి కె.వి.రఘునాథరెడ్డి ప్రోద్బలంతో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘమైన యూత్ కాంగ్రెసులో చేరాడు. కానీ అవి కూడా పెట్టుబడిదారీ వ్యవస్థను కొత్త ముసుగుతో పరిరక్షించే ఎత్తుగడగా త్వరలో అర్ధం చేసుకొని, దానిపై భ్రమలు వీడి విప్లవ పంథాను స్వీకరించాడు. 1972 ఏప్రిల్ 14 సాయంత్రం ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో ఒంటరిగా ఉన్న జార్జిపై 30 మందికి పైగా మత దుండగలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాల మెట్లపై దాడిచేసి కత్తిపోట్లతో చంపేశారు. నేటి సభ్య సమాజంలో ఉన్న యువతకు ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్న మహోన్నత వ్యక్తి జార్జి రెడ్డి.

నరేష్ నాయక్ జాటోత్
8247887267

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News