16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో…
వచ్చేనెల 01వ తేదీ నుంచి అన్ని జిల్లాలో వేసవి క్రీడా శిబిరాలు
మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: ఈనెల 16 వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని క్రీడా స్టేడియాల్లో, మే 01 వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అన్ని జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహించాలని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాట్స్) ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్‌ను, వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అవసరమైన నిధులను శాట్స్‌కు శుక్రవారం ఆయన విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ వేసవి శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. కరోనా కారణంగా రెండేళ్ల నుంచి వాయిదాపడ్డ ఈ వేసవి శిబిరాలను ఈసారి అన్ని స్టేడియాల్లో ఘనంగా నిర్వహించాలని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని క్రీడా శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. దానికి అవసరమైన నిధులను విడుదల చేశామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. చదువులు – పోటీ పరీక్షలు – మార్కులు, ర్యాంకుల ఒత్తిడి నుంచి బయట పడటానికి విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశమన్నారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడానికి ఈ శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో నూక సత్యనారాయణ, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) డిప్యూటీ డైరెక్టర్‌లు సుజాత, ధనలక్ష్మి, అడ్మినిస్ట్రేషన్ అధికారులు గోకుల్, డా. రవికుమార్, శాట్స్ ఉన్నతాధికారులు మనోహర్ గౌడ్, వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు.