శుక్రవారం పలు ప్రాంతాల్లో వగడళ్ల వానలు, కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. ఈ మేరకు ఐఎండీ హైదరాబాద్ అధికారులు విషయాన్ని వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలో చిరుజల్లులు కురవడంతో ప్రజలంతా ఉపశమనం పొందారు. నగరంలోని నాంపల్లి, కోఠి, సుల్తాన్‌బజార్, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, సికింద్రాబాద్, చిలకలగూడ, బేగంపేట, మారేడుపల్లి తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. దుండిగల్, అమీన్‌పూర్, జిన్నారం, గుమ్మడిదల, మేడ్చల్ ఏరియాల్లో వడగళ్ల వాన కురవగా, సంగారెడ్డి పరిధిలోని సదాశివపేట్, ఝూరాసంఘం ప్రాంతంలో కుండపోత వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది.
30 నుంచి 40 కిలోమీట్ల వేగంతో గాలులు…
ఈ మూడురోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని 30 నుంచి 40 కిలోమీట్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందనీ ఐఎండి తెలిపింది. రాగల 24 గంటలపాటు హైదరాబాద్ లో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని ఐఎండి వెల్లడించింది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతోపాటు ఉపరితల గాలులు దక్షిణ లేదా ఆగ్నేయ దిశలో వీచే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది.