కోల్‌కతా : భారతీయ జనతాపార్టీ అహంపై ప్రజలు దెబ్బకొట్టారని కేంద్ర మాజీ మంత్రి, బల్లిగంజ్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి బాబుల్ సుప్రియో వ్యాఖ్యానించారు. బెంగాల్ లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఆయన 20,228 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో అసన్‌సోల్‌లో నుంచి బిజెపి తరఫున ఎంపీగా పోటీ చేసి తన సొంత ఇమేజ్ పైనే గెలిచానని, ఇప్పుడు బలిగంజ్‌లో ఎమ్‌ఎల్‌ఏ గా సాధించే విజయానికి సంబంధించిన క్రెడిట్ అంతా మమతా బెనీర్జీకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. బల్లిగంజ్‌లో బాబుల్‌కు 51,199 ఓట్లు రాగా, సీపీఎం అభ్యర్థికి 30,971 ఓట్లు, బీజెపి అభ్యర్థికి 13,320 ఓట్లు వచ్చాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అసన్‌సోల్ నుంచి ఎంపీగా గెలుపొందిన బాబుల్ సుప్రియో, ఆ తరువాత తన పదవికి , బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి టిఎంసీలో చేరిన విషయం తెలిసిందే .
ఓటర్లకు దీదీ సెల్యూట్
పశ్చిమబెంగాల్ లోని రెండు స్థానాల ఉప ఎన్నికల్లో నిర్ణయాత్మక తీర్పు ఇచ్చినందుకు ఓటర్లకు సీఎం మమతాబెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం తాము ఇచ్చిన మా, మానుష్, మట్టి నినాదానికి బెంగాల్ కొత్త సంవత్సరానికి ప్రజలు ఇచ్చిన కానుక అన్నారు. తమపై విశ్వాసం ఉంచి మరోసారి గెలిపించినందుకు ఓటర్లకు సెల్యూట్ చేస్తున్నామన్నారు.