అధ్యయనం చేపట్టనున్న ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్
న్యూఢిల్లీ : కరోనా లాక్‌డౌన్ సమయంలో కోట్లాది మంది భారతీయులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో దేశంలో ఊబకాయం భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై సంయుక్తంగా అధ్యయనం చేపట్టాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎస్) నిర్ణయించుకున్నట్టు ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. కరోనాకు ముందు, తరువాత వయసుల వారీగా ఊబకాయుల సంఖ్య పెరుగుదలను ఈ సంస్థలు పర్యవేక్షించనున్నాయి. ఈమేరకు అనేక ప్రాంతాలకు చెందిన వారి సమాచారాన్ని ఈ సంస్థలు సేకరించనున్నాయి. ఈ సహకార అధ్యయనానికి అనుమతించిన తరువాత అనేక ఇతర సంస్థలు కూడా ఇందులో భాగస్వామ్యులవుతున్నాయని ఐసీఎంఆర్‌ఎన్‌ఐఎన్‌లో పనిచేసే శాస్త్రవేత్త డాక్టర్ ఆవుల లక్ష్మయ్య వెల్లడించారు.
లాక్‌డౌన్ సమయంలో ఆహార వినియోగంపై ఇప్పటికే అనేక అధ్యయనాలు చేసినట్టు తెలిపారు. బాల్య ఊబకాయంపై ముఖ్యంగా దృష్టి సారించనున్నట్టు లక్షయ్య పేర్కొన్నారు. జంక్‌ఫుడ్ బాల్య ఊబకాయాన్ని పెంచేస్తోందన్నారు. ఊబకాయంపై ఓ పరిశోధనను వెల్లడించామని, అధిక బరువుకు కారణమయ్యే జంక్‌ఫుడ్‌ను విశ్లేషించామని, సరైన ఆహార నియమాలు పాటించక పోవడం కారణం గానే 53 శాతం ఊబకాయం బారిన పడుతున్నట్టు తేలిందని చెప్పారు. ప్రాసెస్ చేసిన జంక్‌ఫుడ్ , ప్రాసెస్ చేసిన ఆహార వినియోగం పిల్లల్లో ఊబకాయం పెరగడానికి కారణమవుతోందని అధ్యయనం లో తేలిందని పేర్కొన్నారు.