టూరిస్టులతో వేసవి సందడి
సిమ్లా : వేసవి విడిదిగా పేరొందిన సిమ్లా ఇప్పుడు పర్యాటకుల సందడితో కళకళలాడుతోంది. తిరిగి కొవిడ్ పూర్వ స్థాయిని చేరుకొంటోంది. శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకూ వేలాది వాహనాలతో ఇక్కడి షోఘీ ప్రాంతం కిక్కిరిసింది. రెండేళ్లుగా జనం సిమ్లా ఇతర సమ్మర్ రిసార్ట్ ప్రాంతాలకు వెళ్లలేని స్థితిలో ఉన్నారు. క్రమేపీ దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నందున దూర ప్రాంతాల నుంచి జనం వివిధ రవాణా మార్గాల ద్వారా సిమ్లా ఇతర ప్రాంతాలకు చేరుకుంటున్నారు. మనాలీ, ధర్మశాల, సిమ్లా ఇతర విడిది ప్రాంతాలలో హోటళ్లలో అత్యధిక రూంలు బుక్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో వరుససెలవులు రావడం, కరోనాకు సమగ్ర టీకాలు ఇప్పుడు అదనంగా బూస్టర్ డోస్ అందుబాటులోకి రావడంతో జనం పలు ప్రాంతాల నుంచి సిమ్లా ఎంచుకుని మరీ వస్తున్నారు. దీనితో ఈ ప్రాంతపు పర్యాటకానికి తిరిగి ఊతం ఏర్పడి, రెక్కలు తెగినట్లుగా ఉన్న సిమ్లా మునుపటి సంతసాన్ని సంతరించుకుంటోందని స్థానికులు పేర్కొంటున్నారు.