మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు శనివారం తెరలేచింది. 45 రోజుల పాటు ఈ క్రీడా శిక్షణ శిబిరాలు కొనసాగనున్నాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు, సాయ్ అథ్లెటిక్స్ కో నాగపురి రమేశ్ ఈ శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్యం నుంచే పిల్లలకు క్రీడలపై ఆసక్తి కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చిన్నారుల్లోని ప్రతిభను గుర్తించి తగిన శిక్షణ ఇస్తే వారు మెరుగైన క్రీడాకారులుగా ఎదగడం ఖాయమని జోస్యం చెప్పారు. కాగా, బ్యాడ్మింటన్, స్మిమ్మింగ్, అథ్లెటిక్స్, రెజ్లింగ్, స్కేటింగ్ తదితర క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తున్నట్టు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి స్టేడియం అడ్మినిస్ట్రేటర్ నందకిశోర్ కోకుల్, ఓయు పిడి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.