జెరూసలెం : ఇజ్రాయెల్ లోని జెరూసలెం అల్ ఆక్సా మసీదు ఆవరణలో ఇజ్రాయెల్ పోలీసులు ఆదివారం ఉదయం చొరబడి గత రెండు రోజులుగా అక్కడ ఉంటున్న పాలస్తీనియన్లను ఖాళీ చేయించారు. ఇంకా ఆ భవనంలో కొందరు పాలస్తీనియన్లు ఉన్నారు. ఈ సందర్భంగా పాలస్తీనియన్లతో స్వల్ప ఘర్షణ ఎదురైంది. ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం పోలీసులు, పాలస్తీనియన్ల మధ్య ఘర్షణలు జరిగాయి. రంజాన్ సందర్భంగా ముస్లింలు ఈ మసీదు లోనే ప్రార్థనలు చేస్తారు. ఇక్కడ యూదులు, ముస్లింల మధ్య మత ఘర్షణలు జరగడం పరిపాటి. యూదులు యధాప్రకారం చర్చికి రాడానికి వీలుగా ఆ మార్గమంతా ఖాళీ చేయించామని పోలీసులు ఆదివారం చెప్పారు. హింస జరుగుతుందని ముందుగానే ఊహించి పాలస్తీనియన్లు రాళ్లు నిల్వచేసుకుని, బారియర్లు ఏర్పాటు చేసుకున్నారని పోలీసులు చెప్పారు.
అయితే యూదులకు, ముస్లింలకు స్వేచ్ఛగా ప్రార్థనలు చేసుకునేలా ఏర్పాట్లు చేయడమే తమ లక్షంగా పోలీసులు చెప్పారు. అయితే మసీదు బయట ఆవరణలో ఇజ్రాయెల్ పోలీసులతో స్వల్ప ఘర్షణ జరిగిందని పది మంది గాయపడ్డారని పాలస్తీనియన్లు వెల్లడించారు. శుక్రవార ం మసీదులో ప్రార్థనల కోసం 60 వేల మంది ముస్లింలు వచ్చారు. గుడ్‌ఫ్రైడే కావడంతో అక్కడే ఉన్న చర్చికి యూదులు కూడా భారీగా తరలి వచ్చారు. యూదుల పవిత్ర స్థలం ముగ్రాభి గేట్ పైకి రాళ్లు రువ్వడంతో ఘర్షణ చెలరేగి పోలీసుల పై కూడా రాళ్లు విసరడం జరిగింది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జీలో 150 మంది గాయపడ్డారు.