Wednesday, November 13, 2024

శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ.338.. భగ్గుమంటున్న జనం

- Advertisement -
- Advertisement -

liter petrol costs Rs 338 In Sri Lanka

కొలంబో : తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.338 కి చేరుకుంది. శ్రీలంక లోని చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ (ఎల్‌ఐఒసి) పెట్రోల్ రేట్లను పెంచిన మరుసటి రోజే దానికి అనుగుణంగా శ్రీలంక ప్రభుత్వ చమురు సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీ) కూడా సోమవారం అర్ధరాత్రి ధరలను పెంచేసింది. 92 ఆక్టేన్ పెట్రోల్ ధరను రూ.84 మేర అధికం చేసింది. ఫలితంగా లీటర్ పెట్రోల్ ధర రూ.338 చేరుకుంది. శ్రీలంకలో గత ఆరు నెలల కాలంలో ఎల్‌ఐఓసీ ఇంధన ధరలను పెంచడం ఇది ఐదోసారి కాగా, సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ నెలరోజుల వ్యవధిలో రెండుసార్లు పెట్రోల్ రేట్లను పెంచింది.

ఇప్పటికే ఇంధన, ఆహార, ఔషధ కొరతతో ఇబ్బందులు పడుతున్న లంకేయులను తాజా పెంపు మరిన్ని ఇబ్బందులకు గురిచేయనున్నది. మరోవైపు లంకలో సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అధ్యక్షుడు అతని కుటుంబం తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొలంబో లోని అధ్యక్ష కార్యాలయం ముందు సహా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల రహదారులను బ్లాక్ చేసి వాహనాలు , టైర్లకు నిప్పంటించారు. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News