కంచుకోటలా ప్రహారీ గోడ
ఇప్పటికే సైనిక వాచ్‌టవర్స్
సరయూ తాకిడి లేకుండా చర్యలు
నిర్మాణ కమిటీ సమీక్షా సమావేశం
అయోధ్య : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయ నిర్మాణ పనులు అత్యంత వేగంగా, ప్రణాళికాయుతంగా సాగుతున్నాయి. ఈ ఆలయానికి కంచుకోట వంటి భద్రతా వలయం ఉంటుంది. రామజన్మభూమి ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మాణపనులను వేగిరపర్చారు. ఇప్పుడు పనులు తుది దశకు చేరుకున్నాయి. జన్మభూమి దేవాలయ కమిటీ ఛైర్మన్ నృపేందర్ మిశ్రా ఆధ్వర్యంలో ఇటీవలే రెండు రోజుల పాటు నిర్మాణ పనుల సమీక్ష జరిగింది. గర్భాలయ పటిష్టతకు వీలుగా చుట్టూ ప్రహారీ గోడను నిర్మిస్తున్నారు. వర్షాకాలం ఆరంభానికి ముందే రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగిపోవాలని కమిటీ నిర్ణయించింది. దుర్భేధ్యపు భద్రతా వలయాలను ఏర్పాటు చేస్తారని వెల్లడైంది. పనులు జరుగుతున్నందున ఇప్పటికే పలు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని నిర్మాణ జాప్యాలను నివారించాలని సంకల్పించారు. దేవాలయ ఆవరణ పర్యవేక్షణకు ఐటి పరిజ్ఞానపు భద్రతా పరికరాలను వాడుతున్నారు.
ఈ ప్రాంతంలో పలు చోట్ల కొత్త వాచ్‌టవర్స్ ఏర్పాటు చేశారు. వీటి నుంచి సైనికులు ఈ ప్రాంతాన్ని నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. కేవలం ఆవరణ ఒక్కటే కాకుండా మొత్తం అయోధ్య నగరాన్ని ఇక్కడి నుంచి వీక్షించవచ్చు. నిర్మాణానికి వాడే విలువైన గ్రానైట్ రాళ్లు 17000 వరకూ ఇటీవలే రాజస్థాన్ భరత్‌పూర్‌లోని బన్సీ పహాడ్‌పూర్ ప్రాంతం నుంచి ఇక్కడికి చేరుకున్నాయి. ఇవి మామూలు రాళ్లు కావు. ఒక్కోదాని బరువు రెండున్నర టన్నుల వరకూ ఉంటుంది. వీటిని అత్యంత జాగ్రత్తగా ఇక్కడికి తీసుకువస్తున్నారు. ఆలయం చుట్టూ నెలకొనే ప్రధాన ప్రహారీ గోడ ప్రత్యేకతలను సంతరించుకుంది. ఇది ఉపరితలానికి 12 మీటర్ల దిగువ , ఉపరితలానికి 11 మీటర్ల ఎగువ వరకూ ఉంటుంది. సరయూ నది ప్రవాహం ఎక్కువైన దశల్లో ఎటువంటి ప్రమాదం తలెత్తకుండా ఉండేందుకు ఈ ప్రాకారం తగు విధంగా నిర్మితం అవుతోంది.