కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
ములుగు జిల్లాలో 44.8 డిగ్రీలు
దేశవ్యాప్తంగా బుధవారం విరుచుకుపడిన సౌరజ్వాలలు
సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్సెస్ ఇండియా-సెస్సీ వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : భానుడు భగభగా మండాడు. బుధవారం ఉదయం 9.27 నిమిషాలకు ఒక్కసారిగా భారీ స్థాయిలో సౌరజ్వాలలతో విరుచుకుపడ్డాడు. సమాచార ఉపగ్రహాలు, జిపిఎస్ వ్యవస్థల్ని దెబ్బతీసే స్థాయిలో ఈ సౌరజ్వాలలు ఉన్నాయని కోల్‌కత్తా కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్సెస్ ఇండియా-సెస్సీ వెల్లడించింది. అయితే ఈ జ్వాలలు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ప్రభావం చూపాయని ఐఎండి తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలోనూ మండుతున్న ఎండలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. భానుడి భగభగలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వడగాల్పుల భయంతో బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. పగటిపూటే కాదు రాత్రి ఉష్ణోగ్రతలూ అసాధారణంగా పెరుగుతున్నాయి. బుధవారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో అత్యధికంగా 44.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది. ములుగు జిల్లాలోని తాడ్వాయి, నిర్మల్ జిల్లా ఖానాపూర్, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లెగోరిలో 44.8 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బోరాజ్‌లో 44.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
ఎక్స్ తరగతి సౌరజ్వాల అన్నింటికన్నా తీవ్రం
బుధవారం దేశవ్యాప్తంగా వెలువడిన సౌరజ్వాలల వల్ల రేడియా సిగ్నళ్లు, విద్యుత్ గ్రిడ్స్, నేవిగేషన్ సిగ్నల్స్ ప్రభావితమై విమానాలకు, వ్యోమగాములకు ముప్పు ఏర్పడే ప్రమాదముందని ఐఎండి తెలిపింది. ఇలాంటి సౌరజ్వాలలు వస్తాయని ఏప్రిల్ 18వ తేదీ ముందస్తుగా దివ్యేందు బృందం అంచనా వేసిందని, భూకంపాల తరహాలో సౌరజ్వాలలను నాసా తీవ్రతను బట్టి వర్గీకరిస్తుందని ఐఎండి తెలిపింది. బుధవారం వచ్చిన ఎక్స్ తరగతి సౌరజ్వాల అన్నింటికన్నా తీవ్రమయ్యిందని, ఎం తరగతి సౌరజ్వాల కన్నా 10 రెట్లు, సి వర్గం సౌరజ్వాల కన్నా 100 రెట్లు తీవ్రతతో ఎక్స్ క్లాస్ సౌరజ్వాల ఉగ్రరూపం చూపిస్తుందని ఐఎండి పేర్కొంది.