Monday, January 20, 2025

‘111’ జిఒ ఆంక్షల రద్దు

- Advertisement -
- Advertisement -

TS government issued orders lifting sanctions of GO111

84గ్రామాల్లో అమలు

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ కొత్తగా
జిఓ 69 పురపాలక శాఖ
హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్‌లలో
నీటి నాణ్యత దెబ్బతినరాదని ప్రభుత్వం షరతు
సిఎస్ ఆధ్వర్యంలో పలు శాఖల
కమిటీ ఏర్పాటు వీలైనంత త్వరగా నివేదిక
ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం

మన తెలంగాణ/ హైదరాబాద్ : జిఒ 111 పరిధిలోని 84 గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా గ్రామాల్లో షరతులతో కూడిన ఆంక్షలతో కొత్తగా జిఒ 69ని పురపాలక శాఖ బుధవారం జారీ చేసింది. అందులో భాగంగా హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల్లో నీటి నా ణ్యత దెబ్బతినరాదని, గ్రీన్‌జోన్స్ డిక్లేర్ చేస్తూ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తూ కొత్త జిఒను అమలు చేయాలని ప్రభుత్వం షరతు విధించింది. షరతుల్లో భాగంగా ఎస్‌టిపిల నిర్మాణం, కాలుష్య తీవ్రత తగ్గింపునకు ప్రభుత్వం చ ర్యలు తీసుకోనుంది. భూగర్భ జలాల నాణ్యత పరిరక్షణకు చర్యలు తీసుకోనున్న ప్రభుత్వం జలాశయాల్లోకి నీరు వెళ్లేలా డైవర్షన్ ఛానళ్ల నిర్మాణాలు చేపట్టనుంది. ఎస్‌టిపిల నుంచి వచ్చే నీరు జంట జలాశయాల్లో కలవకుం డా జాగ్రత్తలు తీసుకోనుంది. అంతేకాకుండా జంట జలాశయాల చుట్టుపక్కల గ్రామాల్లో సివరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. తద్వారా భూగర్భ జలాలు కలుషితం కాకుండా చర్యలు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను చేపట్ట ంది. దీనికి సంబంధించి విధి, విధానాల రూపకల్పన, సమగ్ర మార్గదర్శకాల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీనీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. జంట జలాశయాల పరిరక్షణ, కాలుష్య నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు, గ్రీన్‌జోన్లు సహా జోన్ల నిర్ధారణ, ట్రంక్ వ్యవస్థ అభివృద్ధి కోసం ఈ కమిటీ విధి, విధానాలు రూపొందించాల్సి ఉంటుంది. అందులో భాగంగా రోడ్లు, డ్రైనేజీలు, ఎస్టీపీలు, డైవర్షన్ డ్రైన్ల నిర్మాణానికి నిధులను సమీకరించాల్సి ఉంటుంది.

సిఎస్ నేతృత్వంలో కమిటీ…

జంట జలాశయాల పరిరక్షణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా మున్సిపల్, ఫైనాన్స్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, వాటర్ బోర్డు ఎండి, పొల్యూషన్ కంట్రోల్ మెంబర్ సెక్రటరీ, హెచ్‌ఎండిఏ డైరెక్టర్‌లు ఉంటారు. జంట జలాశయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన మార్గదర్శకాల రూపకల్పనకు సిఎస్ నేతృత్వంలోని కమిటీ కసరత్తు చేయనుంది. గ్రీన్‌జోన్‌ల గుర్తింపు, మురుగునీరు వెళ్లే టాక్ లైన్స్ ఏర్పాటు ప్లానింగ్, ఎస్టీపిలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి, 84 గ్రామాల్లో భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్లానింగ్ ఎలా ఉండాలన్న తదితర అంశాలపై కచ్చితమైన మార్గదర్శకాలను ఈ కమిటీ తయారు చేయనుంది.

మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న….

జిఒ 111 పరిధి నుంచి 84 గ్రామాలకు విముక్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఈ జీఓను జారీ చేశారు. గతంలో మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ జిఓను విడుదల చేసింది. జంట జలాశయాల పరిరక్షణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం వేసిన కమిటీ వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

అసలు జిఒ 111 అంటే ఏమిటీ?

నగర శివారులోని గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిరక్షణకు జీఓ 111 అమల్లో ఉంది. పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర నిషేధం విధిస్తూ 1994లో తొలుత జిఒ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీఓ 111ను అమల్లో పెట్టింది. ఆ జీఓలో క్యాచ్‌మెంట్ పరిధిలో వేసే లే ఔట్లలో 60 శాతం ఓపెన్ స్థలాలు, రోడ్లకు వదలాలి. వినియోగించే భూమిలో 90శాతం కన్జర్వేషన్ కోసం కేటాయించాలి. ఇందుకుగాను హుడా బాధ్యత వహించాలి. రసాయనాలు, క్రిమిసంహారకాల స్థాయిలు లెక్కించేందుకు ప్రత్యేక ఏజెన్సీతో పర్యవేక్షించాలి. జీ+2కి మించి నిర్మాణాలు చేసేందుకు వీల్లేదని పేర్కొంది.

జిఒ 111 ఎత్తివేయడం లేదా పరిధి కుదించాలని..

ఒకప్పుడు జంట జలాశయాల నుంచి హైదరాబాద్‌కు తాగునీటి అవసరాలు తీరేవి. రానురానూ కృష్ణా, గోదావరి జలాలు అందుబాటులోకి రావడంతో జంట జలాశయాలపై స్థానికులు ఆధారపడటం లేదు. దీనివల్ల జిఒ 111 ఎత్తివేయడం లేదా పరిధి కుదించాలని కొన్నేళ్లుగా డిమాండ్ వస్తోంది. ఈ జిఒపై అధ్యయనం చేసేందుకు 2016లో తెలంగాణ ప్రభుత్వం హైపర్ కమిటీని నియమించింది. గ్రామాల పరిధిలోని పాలకవర్గాలు గతంలో పలుమార్లు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాయి. జిఒ ఎత్తివేతకు వ్యతిరేకంగా పలువురు పర్యావరణవేత్తలు న్యాయస్థానాలను ఆశ్రయించారు. జిఒపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై గతేడాది సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. జలాశయాలను పరిరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సిఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో పలు షరతులు విధిస్తూ జీఓ 111 పరిధి గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కొత్తగాఉత్తర్వులు జారీ చేసింది.

జిఒ పరిధిలోకి వచ్చే మండలాలు, గ్రామాలు

జిఒ పరిధిలోకి వచ్చే మండలాలు, గ్రామాలు ఇలా ఉన్నాయి. మొయినాబాద్ మండలంలో 20 గ్రామాలు, శంషాబాద్ మండలంలో 47 గ్రామాలు, షాబాద్ మండలంలో 02 గ్రామాలు, కొత్తూరు మండలంలో 01 గ్రామం, రాజేంద్రనగర్ మండలంలో 03 గ్రామాలు, శంకర్‌పల్లి మండలంలో 03 గ్రామాలు, చేవెళ్ల మండలంలో 06 గ్రామాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News