దేశంలో మెడికల్ పిజి సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తయింది. రాష్ర్టంలో ఎప్పట్లాగే మెడికల్ పిజి సీట్ల బ్లాక్ దందా మొదలయింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు నీట్ లో ర్యాంకు వచ్చిన ఇతర రాష్ట్రాల విద్యార్థులతో కుమ్మక్కై వారితో మన రాష్ర్టంలో ఉన్న మేనేజ్‌మెంట్ సీట్లకు దరఖాస్తు చేయిస్తున్నారు. సీటు కేటాయింపు అయ్యాక దరఖాస్తు చేయించిన ఇతర రాష్ట్రాల విద్యార్థులను, తిరిగి ఆ సీట్లను వదులుకునేలా చేస్తున్నారు. దీంతో మేనేజ్‌మెంట్ సీట్లను ఎన్‌ఆర్‌ఐ సీట్లుగా మార్చి ఒక్కో సీటుకి రూ. 2 కోట్లకు అమ్ముకుంటున్నారు. నిబంధనలో ఉన్న లొసుగులను వాడుకొని ప్రైవేట్ మెడికల్ మేనేజ్‌మెంట్ మాఫియా కోట్లాది రూపాయల ఫీజుల దోపిడీ చేస్తుంది? మన రాష్ర్టంలో 26 మెడికల్ కాలేజీలు ఉన్నా యి. దాంట్లో సగం సీట్లను కన్వీనర్ కోటాలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు ప్రకారం భర్తీ చేస్తారు. మిగతా సగం సీట్లలో మూడు కేటగిరీల వారీగా సీట్ల భర్తీ ప్రక్రియ ఉంటుంది.
మొదటి కేటగిరిలో 50 శాతం సీట్లను మేనేజ్‌మెంట్ కోటాలో భర్తీ చేస్తారు. రెండవ కేటగిరీలో 30 శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐ, ఎన్నారై స్పాన్సర్డ్ సీట్లుగా భర్తీ చేస్తారు. మూడవ కేటగిరిలో మిగతా 20 శాతం సీట్లను మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు ప్రకారం తమకు ఇష్టం వచ్చిన వారికి ఇవ్వొచ్చు. రెండవ, మూడవ కేటగిరీలో ఫీజు గరిష్ఠంగా రూ. 72 లక్షలు మాత్రమే ఉంది. కానీ ప్రైవేట్ మెడికల్ మేనేజ్‌మెంట్ మాఫియా వేరే రాష్ర్ట విద్యార్థులతో ఇక్కడ దరఖాస్తు చేయించి పథకం ప్రకారం ఆ సీట్లను బ్లాక్ చేసి, ఆ తర్వాత వాటిని ఎన్‌ఆర్‌ఐ, ఎన్నారై స్పాన్సర్డ్ సీట్లుగా, మూడవ కేటగిరీ సీట్లుగా మార్చి ఒక్కో సీటుకు కోట్లాది రూపాయలను దండుకుంటుంది. నకిలీ ఏజెంట్‌లను తయారు చేసి బీహార్, ఒడిశా విద్యార్థులతో ఈ తతంగాన్ని నడుపుతున్నారు. మొత్తం 500 సీట్లలో ఈ బ్లాక్ దందా నడిచింది. ఈ బ్లాక్ దందాతో అర్హత, సామర్థ్యం ఉండి అనేక మంది తెలంగాణ బిడ్డలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది.
అర్హత, సామర్థ్యం లేనివాళ్లు, కేవలం ఆర్థిక, అంగబలం ఉపయోగించి మెడికల్‌లో పిజిలు చేసే అవకాశం ఉంది. కోట్లాది రూపాయలను వెచ్చించి చదివే వీరు డాక్టర్ లు అయ్యాక రేపు సమాజంలో ఫీజుల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తారే తప్ప, సేవాగుణాన్ని కలిగి ఉండరు. దీంతో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు వైద్యానికి దూరం అయ్యే ప్రమాదం ఉంది. ప్రజలకు వైద్యం అందక ఆరోగ్యరంగం తీవ్రమైన సంక్షోభంలో పడే అవకాశం ఉంది. మన దేశంలో డాక్టర్ల కొరత చాలా తీవ్రంగా ఉంది. ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది. కానీ దేశంలో 1800 మందికి ఒక డాక్టర్ మాత్రమే ఉన్నారు. దేశంలో దాదాపు 5 లక్షల మంది డాక్టర్లు కొరత ఉంది. మూడు లక్షల మంది నర్సుల కొరత ఉంది. దాదాపు లక్ష 30 వేల మంది ఎంబిబిఎస్ చేసిన డాక్టర్లు కేవలం పిజి ఎగ్జావ్‌ు రాయడం కోసం ప్రాక్టీసును వదిలేసి ప్రిపేర్ అవుతున్నారు. దేశంలో వైద్య విద్య సీట్ల కొరత దీనికి నిదర్శనం. భారత దేశ ప్రజల అవసరాలకు తగ్గట్టుగా, జనాభా ప్రకారం మెడికల్ సీట్ల సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. నేడు కేవలం 25 వేల పిజి సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీనిని ఐదు రెట్లు పెంచాలి. వైద్య కళాశాలలను, రీసెర్చ్ సెంటర్‌లు పెంచి వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలు చేయడానికి ప్రోత్సహించాలి.
కరోనా లాంటి విపత్తులు వస్తే దేశంలో ఉన్న ప్రజలంతా భయకంపితులైనారు. ప్రజలంతా ప్రాణా లు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ బతికారు. అనేక మంది ప్రజలు వైద్యం, ఆక్సిజన్ అందక నిర్దాక్షిణ్యంగా చనిపోయారు. కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి దోపిడీకి గురయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి వైద్యరంగాన్ని మరింత బలోపేతం చేయాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. వైద్య విద్య సీట్లను, యుద్ధప్రాతిపదికన పెంచి డాక్టర్ చదువు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలి. దేశంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు అధికంగా రాజకీయ నాయకులవి. కొంతమంది ప్రైవేట్ మెడికల్ మేనేజ్‌ంట్‌లు అధికారులతో కుమ్మక్కై ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు. బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ బ్లాక్ దందాను గుర్తించి కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, విసిలను కలిస్తే తప్ప అధికారుల్లో చలనం రాలేదు.
అంటే ఈ మెడికల్ మాఫియా ఏ స్థాయిలో పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రైవేట్ మెడికల్ మేనేజ్‌మెంట్ మాఫియా అనేక ఏళ్ళ నుండి ఇలాగే చేస్తుంది. దీంతో అనేక మంది తెలంగాణ బిడ్డలు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికార యంత్రాంగం, వైద్య విద్యాశాఖ అధికారులు స్పందించి ఈ బ్లాక్ దందాపై విచారణ నిర్వహించి, మెడికల్ కాలేజ్ మాఫియాను నియంత్రించాలి. బ్లాక్ చేసిన సీట్లను, న్యాయంగా రావలసిన విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. బ్లాక్ చేసిన ఇతర రాష్ర్ట విద్యార్థులు, ఈ తతంగాన్ని నడిపిన ప్రైవేట్ మెడికల్ యాజమాన్యాలపై కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలి.