తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించిన సుప్రీం
న్యూఢిల్లీ : రాజధాని నగరం లోని జహంగీర్‌పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్‌లో స్థానిక అధికారులు వ్యవహరించిన తీరును గురువారం సుప్రీం కోర్టు తప్పు పట్టింది. కూల్చివేత ప్రక్రియను నిలిపివేయమని ఆదేశించిన తరువాత కూడా దాన్ని కొనసాగించడాన్ని తీవ్రంగా పరిగణించింది. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని మేయర్‌కు తెలియజేసిన తర్వాత జరిగిన అన్ని కూల్చివేతలను మేం తీవ్రంగా పరిగణిస్తాం. ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు యథాతధ స్థితిని కొనసాగించాలి అంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే దీనిపై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఇటీవల ఘర్షణలతో అట్టుడికిన ఢిల్లీ జహంగీర్‌పురి ప్రాంతంలో బుధవారం అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అక్కడ అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌డిఎంసీ) హడావుడిగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం కలకలం రేపింది. బుల్డోజర్లను ఉపయోగిస్తూ కొన్ని నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేయగా, సుప్రీం కోర్టు జోక్యం చేసుకొంది. కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.
ఈ వ్యవహారంపై తాము గురువారం విచారణ చేపడతామని , అప్పటివరకు యథాతధ స్థితిని కొనసాగించాలని నిర్దేశించింది. అయినా గంటన్నర వరకు అక్కడ కూల్చివేతలు ఆగలేదు. న్యాయస్థానం నుంచి లిఖితపూర్వక ఉత్తర్వులు అందక పోవడమే అందుకు కారణమని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. ఆ విషయాన్ని సీజేఐ నేతృత్వం లోని ధర్మాసనం వద్ద పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రస్తావించారు. వెంటనే స్పందించిన సీజేఐ జస్టిస్ ఎన్‌వి రమణ , కూల్చివేతలను ఆపాల్సిందిగా తాము ఆదేశించిన సంగతిని సంబంధిత అధికారులకు సత్వరం తెలియజేయాలని కోర్టు సెక్రటరీ జనరల్‌కు సూచించారు. అనంతరం డ్రైవ్‌ను నిలిపివేస్తున్నట్టు ఎన్‌డీఎంసీ మేయర్ రాజు ఇక్బాల్ సింగ్ తెలిపారు. ఇదిలా ఉండగా విచారణలో భాగంగా పిటిషనర్లు కోర్టులో తమ వాదనలు వినిపించారు. తాము పత్రాలు చూపించినా కూల్చివేత ఆపలేదని , తమను లక్షంగా చేసుకున్నారని ఆరోపించారు. మరోపక్క తాము చిన్నపాటి నిర్మాణాలను మాత్రమే తొలగించామని, స్థానిక యంత్రాంగం వాదించగా, దానికి బుల్డోజర్లు ఎందుకని కోర్టు ప్రశ్నించింది. ఈ కూల్చివేతలపై మున్సిపల్ కార్పొరేషన్, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.