సిఎం, మంత్రుల సంతాపం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ రచయిత, కాలమిస్టు, తెలంగాణ అధికార భాషా సంఘ తొలి అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు(84) గురువారం నాడు కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న దేవులపల్లి ప్రభాకర్‌రావకు మార్చి 31న నగరంలో ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య సేవల నిమిత్తం చేర్పించారు. ఈక్రమంలో ఆయన చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. కాగా ప్రభాకర్ రావు 2021 నవంబరు నెల నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలియజేశారు. తెలంగాణ అధికార భాషా సంఘ తొలి అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు మరణం పట్ల సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరారు. తెలంగాణ అధికార భాషా సం ఘం అధ్యక్షులుగా దేవులపల్లి అందించిన సేవలను మరచిపోలేనివని ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని సిఎం గుర్తు చేసుకున్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రభాకర్‌రావు గతంలో గోల్కొండ పత్రికలో అనేక సంపాదకీయాలు ప్రచురితమయ్యాయి.
అదేవిధంగా దేవులపల్లి ఈనాడు, ఆంథ్రభూమి, వార్త, ప్రజాతంత్ర, నమస్తే తెలంగాణతో పాటు పలు పత్రికల్లో పలు వ్యాసాలు రాశారు. దేవులపల్లి రచయితగా ఎన్నొ పుస్తకాలు కూడా రా శారు. ఆయన మృతి పట్ల మంత్రులు కెటిఆర్, జగదీష్ రెడ్డి , నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్,తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.