జమ్మూ శివార్లలో కలకలం
సిఐఎస్‌ఎఫ్ శిబిరం ఎఎస్‌ఐ మృతి
ఇద్దరు జైషే టెర్రరిస్టుల హతం
రేపు ప్రధాని పర్యటన దశలో ఘటన
శ్రీనగర్ : జమ్మూ శివార్లలో శుక్రవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు. ఈ సంఘటనలో సిఐఎస్‌ఎఫ్‌కు చెందిన ఓ ఎఎస్‌ఐ మృతి చెందారు. పరస్పర కాల్పులతో ఇద్దరు ఉగ్రవాదులు హతులయ్యారు. వీరిని జైషే మహమ్మద్ సంస్థకు చెందిన వారుగా గుర్తించారు. ప్రధాని నరేంద్ర మోడీ మరో రెండు రోజులలో జమ్మూ ప్రాంత పర్యటనకు వస్తున్న దశలో శివార్లలోని ఆర్మీక్యాంప్ వద్ద ఉగ్రవాదుల బృందం దాడికి దిగింది. ఏకంగా వీరు సైనిక శిబిరాన్ని ఎంచుకునే ఈ తెగింపునకు దిగారు. ఎన్‌కౌంటర్‌కు దారితీసిన ఈ ఘటన సమయంలో క్యాంప్‌లో విధులకు సిఐఎస్‌ఎఫ్‌కు చెందిన 15 మంది జవాన్ల బృందంతో బస్సు బయలుదేరింది. దీనిని టార్గెట్‌గా చేసుకుని క్యాంప్ సమీపంలో జమ్మూకు శివార్లలోనే ఈ దాడి జరిగింది. కాల్పుల్లో తొమ్మండుగురు జవాన్లు గాయపడ్డారు.
చాలా సేపటివరకూ కాల్పలు భీకరంగా సాగాయి. క్యాంప్‌నకు సమీపంలో తమ వ్యాన్‌పై ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టామని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ముఖేష్ సింగ్ తెలియచేసినట్లు వార్తా సంస్థలు తెలిపాయి. ఇప్పటికీ ఇద్దరు ఉగ్రవాదులను తుదముట్టించారని అక్కడ పలు మారణాయుధాలు శాటిలైట్ ఫోటోలు కొన్ని కీలక పత్రాలు దొరికినట్లు అధికారులు తెలిపారు. మృతులైన ఉగ్రవాదులను జైషే మహమ్మద్ సంస్థ వారిగా గుర్తించారు. ప్రధాని మోడీ జమ్మూ పర్యటన నేపథ్యంలో శాంతిభద్రతల విచ్ఛిన్నానికి ఈ దాడి జరిగినట్లుగా భావిస్తున్నామని జమ్మూ ప్రాంత అధికారులు తెలిపారు. రెండు రోజుల తరువాత ప్రధాని మోడీ ఇక్కడి సాంబా సెక్టర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు వస్తున్నారు. ఈ నెల 24వ తేదీన ఇక్కడి పాలీ నుంచిదేశంలోని పంచాయతీ సంస్థల నుంచి ప్రధాని మోడీ ఆన్‌లైన్‌లో ప్రసగించనున్నారు.