ఇంటలిజెన్స్ నివేదికలతో కమెండోలతో హోంశాఖ ఏర్పాట్లు
న్యూఢిల్లీ : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్ సోమనాథ్, మహారాష్ట్ర పార్లమెంట్ సభ్యులు నవనీత్ రాణాలకు కేంద్రం విఐపి భద్రతా వలయం ఏర్పాటు చేసింది. వీరికి కేంద్ర సాయుధ బలగాల విఐపి భద్రత ఏర్పాట్లు చేశారని అధికారులు శుక్రవారం తెలిపారు. ఇంటలిజెన్స్ వర్గాల నివేదికల ప్రాతిపదికన వీరికి సాయుధ బలగాలు పారామిలిటరీ దళాల కాపలా అవసరం అని తేలింది. ఇందుకు అనుగుణంగానే వీరికి పారామిలిటరీ కమెండోలతో భద్రతను ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు. ఇస్రో ఛైర్మన్‌కు సంబంధించి దేశ అత్యంత కీలకమైన అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల రహస్యాలు కాపాడే బాధ్యత ఉంటుంది.
ఇక మహారాష్ట్రలోని అమరావతి మహిళా ఎంపి అయిన నవనీత్ రాణా కు వై కేటగిరి సెక్యూరిటీ ఉంటుంది. నవనీత్ తన భర్త ఎమ్మెల్యే రవిరానాతో కలిసి శనివారం (నేడు) మహారాష్ట్ర సిఎం నివాసం ఎదుట సుదీర్ఘ హనుమాన్ చాలీసా పఠనానికి సంకల్పించారు. ఈ దంపతులకు బిజెపితో లోగుట్టు అవగావహన ఉందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ఈ హనుమాన్ చాలీసాకు దిగుతున్నారని వీరికి వై కేటగిరి సెక్యూరిటి కల్పనతో శాంతిభద్రతల పరిరక్షణకు వీలేర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇస్రో ఛైర్మన్‌కు వై కేటగిరి సెక్యూరిటి పరిధిలో ఎల్లవేళలా ఆరుగురు సాయుధ కమెండోల భద్రత ఉంటుంది.