Monday, December 23, 2024

జూన్ నాటికి డిగ్రీ పరీక్షలు పూర్తి

- Advertisement -
- Advertisement -

పిజి ప్రవేశాలకు మేలో నోటిఫికేషన్…ఆగస్టులో పరీక్షలు
వర్సిటీలు, కాలేజీలు న్యాక్ అక్రిడియేషన్ పొందాలి
వైస్ ఛాన్స్‌లర్ల సమావేశంలో నిర్ణయం

Degree exams completed upto June
మనతెలంగాణ/హైదరాబాద్ : జాతీయస్థాయిలో నిర్వహించే పిజి ప్రవేశాలు పొందాలనుకునే రాష్ట్ర విద్యార్థులకు ఇబ్బంది లేకుండా జూన్ చివరి నాటికి అన్ని యూనివర్సిటీలు డిగ్రీ పరీక్షలు పూర్తి చేయాలని వైస్ ఛాన్స్‌లర్ల సమావేశంలో నిర్ణయించారు. ఆరు యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్లతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి శనివారం సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్య మండలి వైస్ ఛైర్మన్ వి.వెంకటరమణ, యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్లు రవీందర్, రవీంద్రగుప్తా, గోపాల్ రెడ్డి, రమేష్, రాథోడ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. పరీక్షల నిర్వహణ, న్యాక్ అక్రిడియేషన్, ఉమ్మడి పిజి ప్రవేశ పరీక్ష తదితర అంశాలపై చర్చించారు. కేంద్ర విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఆగస్టు నెలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు, కాబట్టి ఆయా విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు రాష్ట్రంలో సకాలంలో తుది సెమిస్టర్ పూర్తవ్వకపోవడంతో అవకాశం కోల్పోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి జూన్ చివరి నాటికే రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలని ఛైర్మన్ లింబాద్రి వైస్ ఛాన్స్‌లర్లకు సూచించారు.

వర్సిటీలు, కాలేజీలకు న్యాక్ గుర్తింపు

రాష్ట్రంలో ఎక్కువ విద్యా సంస్థలు నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపుకు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని, దీని కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని విసిల సమావేశంలో నిర్ణయించారు. యూనివర్సిటీలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు కూడా న్యాక్ గుర్తింపు పొందేందుకు ఉన్నత విద్యామండలి సహకారం అందించనుంది. న్యాక్ గుర్తింపు కోసం ఉన్నత విద్యామండలి యూనివర్సిటీలకు రూ.2 లక్షలు, కాలేజీలకు రూ.లక్ష నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. గుర్తింపు కాల పరిమితి తీరిన కాలేజీలను తిరిగి దరఖాస్తు చేయించడం, గుర్తింపు ఉన్న వాటి స్థాయి పెంపుకు ప్రయత్నాలు చేయడం వంటివి చేపట్టనున్నారు. రాష్ట్రంలో 125 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉండగా, అందులో 84 కాలేజీలకు ఇప్పటికే న్యాక్ గుర్తింపు ఉందని, మిగతా కాలేజీలు కూడా న్యాక్ గుర్తింపు పొందేందుకు తగిన ప్రోత్సాహం అందించాలని నిర్ణయించారు.

మేలో పిజి ప్రవేశాలకు నోటిఫికేషన్

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఈ సారి ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించాలని వైస్ ఛాన్స్‌లర్ల సమావేశం తీర్మానించింది. సిపిగెట్ పరీక్షకు మేలో నోటిఫికేషన్ ఇచ్చి, ఆగస్టులో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని విశ్వవిద్యాలయాలతో ఉన్నత విద్యా మండలి సమన్వయం చేసుకుంటుందని ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. అఖిల భారత సర్వే కోసం అవసరమైన డేటాను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేయాలని ఛైర్మన్ లింబాద్రి వైస్ ఛాన్స్‌లర్లకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News