ఖమ్మంలో 20ఏళ్లుగా నడుస్తున్న మమత మెడికల్ కాలేజీలో పిజి అడ్మిషన్లు అత్యంత పారదర్శకంగా జరుగుతాయి ఆరోపణను నిరూపించలేకపోతే రేవంత్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి
మన తెలంగాణ/హైదరాబాద్: పిజి మెడికల్ సీట్ల దందా పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన మీద గవర్నర్‌కు తప్పుడు ఫిర్యాదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మంలో గత 20 ఏండ్లుగా నడుస్తున్న మమత మెడికల్ కాలేజీలో పిజి అడ్మిషన్లు అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు. యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్లు జరుగుతున్న కౌన్సెలింగ్ అలా ట్ మెంట్ సమయంలోనే మా కాలేజీలో సీట్లు నిండిపోతుంటాయన్నారు. అలాంటప్పుడు మాకు బ్లాక్ చేసి దందా చేయాల్సిన అవసరమే లేదన్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఇది పూర్తి గా నిరాధారమన్నారు. తప్పుడు ఆరోపణలతో బట్టకాల్చి మీదేస్తే సహిం చేదిలేదని ఆయన హెచ్చరించారు. ఒకవేళ రేవంత్ తన కాలేజీలో ఒక్క సీటునైనా బ్లాకు దందా చేసినట్టు నిరూపిస్తే…కాలేజీని రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని సవాల్ విసిరారు. దానిని నిరూపంచలేని పక్షంలో రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలన్నారు. తనపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోని పక్షంలో చట్టపరమైన చర్యలకు రేవంత్ రెడ్డి సిద్దపడాలన్నారు. అత్యున్నత ప్రమాణాలతో నడుస్తున్న కాలేజీప్రతిష్టనుమంటగలిపే దుర్మార్గపు చర్యలను తిప్పికొడుతామన్నారు.
Minister Puvvada Ajay Kumar slams Revanth Reddy