బెంగళూరు : పార్టీ ఫిరాయింపుల చట్టానికి సవరణ చేయాల్సిన అవసరం ఆసన్నమైందని, ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎవరైనా పార్టీ మారాలనుకుంటే ముందు తన పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికవ్వాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్ ఏర్పాటై 50 వసంతాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్ సభ్యులు ఆయనను సన్మానించారు. నవభారత నిర్మాణంలో మీడియా పాత్ర అనే అంశంపై ఆయన మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్లు, ఛైర్‌పర్సన్లు, కోర్టుల పాత్రను కూడా ఆయన తప్పుబట్టారు. ఛైర్మన్లకు, స్పీకర్లకు ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునే విశిష్ట అధికారం ఉన్నప్పటికీ ఆ విధంగా వ్యవహరించడం లేదన్నారు. కోర్టుల పరిధిలో కూడా ఈ విషయంలో జాప్యం జరుగుతోందన్నారు. కొన్నిసార్లు సదరు ప్రజాప్రతినిధి పదవీకాలం కూడా ముగిసిపోతోందని వ్యాఖ్యానించారు. ఫిరాయింపుల అంశాన్ని తేల్చేందుకు గరిష్ఠంగా ఆరునెలల్లోపే నిర్ణయం వెలువరించాల్సిన అవసరం ఉందని, తానైతే మూడు నెలల్లో తేలాలని కోరుకుంటానని చెప్పారు.