గర్భిణులు,బాలింతల్లో రక్తహీనత నివారణకు చర్యలు
తొమ్మిది జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా కెసిఆర్ న్యూటిషన్ కిట్
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మాతా శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. మహిళా సాధికారత, సంక్షేమం, సమగ్ర వికాసం కోసం చేపడుతున్న పథకాల అమలులో అంగన్‌వాడీ కేంద్రాలు కీలకంగా మారాయి. ఈ కేంద్రాల ద్వారా మాతా శిశు సంరక్షణ, సంక్షేమానికి పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఐసిడిఎస్ ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా పోషకాహారాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. అయినా గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉండటాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు కొత్తగా ’ కెసిఆర్ న్యూట్రిషన్ కిట్‌ను అందించాలని సమాయత్తమవుతోంది. తొమ్మిది జిల్లాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేయగా, రాష్ట్రమంతటా అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. గర్భిణులు, బాలింతలకు న్యూట్రిషియన్ కిట్ ఇవ్వాలని ప్రభుత్వం ముందుకు రావడంతో రక్తహీనతతో బాధపడుతున్న వారికి మేలు కలుగుతుంది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది.
దీంతో రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య రక్షణ కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోందని ఐసిడిఎస్ అధికారులు పేర్కొంటున్నారు. పైలెట్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు పోషకాహారం అందిస్తుండగా, వీరిలో రక్తహీనత 15 శాతానికి పైగా ఉంటోంది. ఏడు నెలల నుంచి 3 ఏళ్ల వరకు పిల్లలు, మూడు నుంచి 6 ఏళ్ల మధ్య పిల్లల్లో రక్తహీనత 20 శాతంగా ఉంది. ప్రతి అంగన్‌వాడీ కేంద్రం ద్వారా పిల్లలకు, గర్భిణీ, బాలింతలకు ప్రతిరోజూ 150 గ్రాము బియ్యం. 30 గ్రాముల పప్పు, 16 గ్రాముల వంటనూనె, ఒక్క గుడ్డుతో ఆహారం తయారు చేసి ఇస్తున్నారు. 200 మి.లీ. పాలు ఇస్తున్నారు. ఇలా ఇస్తున్నప్పటికీ ఐరన్ లోపంతో రక్తహీనత సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనిని గమనించిన ప్రభుత్వం త్వరలో కెసిఆర్ కిట్ ద్వారా నివారించేందుకు చర్యలు చేపట్టింది.
రక్తహీనతతో సమస్యలు..
రక్తహీనతతో బలహీనత, గర్భస్రావం, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, పుట్టిన బిడ్డ లేదా తల్లి చనిపోవడం, అలసట, తలనొప్పి, ఊపిరి సరిగా రాకపోవడం, చికాకు, ఆకలి లేకపోవడం, మైకం, కళ్లు తిరగడం, అరచేతుల్లో చెమట, పాదాల్లో నీరు చేరడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరం పాలిపోయి ఉండటం, కొన్ని సందర్భాల్లో స్పృహ కోల్పోయే అవకాశం ఉన్నట్లు వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. బాలింతలకు ఆరోగ్య కేంద్రాల్లో ఐరన్ సమస్య నివారణకు ఐరనో ఫోలిక్ ఆసిడ్ మాత్రలు ఇస్తున్నారు. వీటితో శరీరానికి రక్త పుష్టి చేకూరుతుంది. ఐరన్ కలిగిన తోటకూర, పుంటికూర, పాలకూర, మెంతికూర, బచ్చలికూర లాంటి వాటిని రోజు ఆహారంలో తీసుకుంటే మంచిదని వైద్యులు పేర్కొంటున్నారు. డ్రైఫ్రూట్స్, బెల్లం, మాంసహారం తీసుకోవాలని చెబుతున్నారు. కూరగాయలు, బీట్ రూట్, టమాట వంటకాలు, అరటి, ద్రాక్ష, ఆపిల్ పండ్లను తినాలని సూచిస్తున్నారు.
రక్తహీనత నివారణ కోసం న్యూట్రిషియన్ కిట్‌లు : రాష్ట్ర స్త్రీ ,- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్
రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో 1,25,000 లబ్ధిదారులలో రక్తహీనత నివారణ కోసం కెసిఆర్ న్యూటిషియన్ కిట్‌లను అందించనున్నాం. గిరిజన ప్రాంతాల్లో పోషకాహారాన్ని అందించడం ద్వారా రక్తహీనతను నివారించేందుకు గిరిపోషణ అమలు చేస్తున్నాం. బడ్జెట్‌లో ప్రత్యేకంగా కెసిఆర్ న్యూట్రిషియన్ కిట్‌కు నిధులు కేటాయించాం. కెసిఆర్ కిట్ తో ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు పెరిగాయని, మాతా, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయన్నారు. కల్యాణ లక్ష్మీ పథకంతో బాల్య వివాహాలు తగ్గాయి. గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత సమస్య పరిష్కరించేందుకు కొత్తగా అమలు చేయనున్న కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ దోహదం చేస్తుంది.