Monday, November 25, 2024

కాంగ్రెస్‌లో చేరను

- Advertisement -
- Advertisement -

సలహాదారుగానే ఉంటా: ప్రశాంత్ కిశోర్

సోనియాగాంధీ ఆహ్వానాన్ని పికె తిరస్కరించారు: కాంగ్రెస్ ప్రధాన
కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా నేను సలహాదారుగా పనిచేయడమే
అవసరం సాధికారత కమిటీలో చేరాలని, ఎన్నికల బాధ్యతలు
తీసుకోవాలని చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నా: పికె ట్వీట్

న్యూఢిల్లీ: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పికె) కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైందంటూ ప్రచారం జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పికె నిరాకరించినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీస్ సుర్జేవాలా వెల్లడించారు.2024 సార్వత్రిక ఎన్నికల సన్నద్ధత కోసం కాంగ్రెస్ పార్టీకి పికె ఇచ్చిన ప్రజంటేషన్‌పై చర్చించిన అనంతరం పార్టీ యాక్షన్ గ్రూపును ఏర్పాటు చేసింది. అయితే ఆ సాధికారత కమిటీలో సభ్యుడిగా ఉండడానికి పికె అంగీకరించలేదని, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆయనను పార్టీలోకి ఆహ్వానించగా ప్రశాంత్ కిశోర్ నిరాకరించారని సుర్జేవాలా తెలిపారు. తమ పార్టీ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని పార్టీకి ఇచ్చిన సూచనలను తాము అభినందిస్తున్నట్లు సుర్జేవాలా తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

నేను సలహాదారుగా పని చేయడమే అవసరం: పికె

మరోవైపు ఇదే అంశంపై ప్రశాంత్ కిశోర్ సైతం ట్వీట్ చేశారు. సాధికారత కమిటీలో చేరాలని, ఎన్నికల బాధ్యతలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ చేసిన ఉదారమైన ప్రతిపాదనను తిరస్కరించినట్లు ప్రకటించారు. నిర్మాణమైన సమస్యల్లో పాతుకుపోయిన కాంగ్రెస్‌కు తన అవసరం కన్నా నాయకత్వం, సమష్టి సంకల్పం అవసరమని పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని.. సలహాదారుగా మాత్రమే పని చేస్తానని స్పష్టం చేశారు.తాను పార్టీలో చేరడంకంటే సలహాదారుగా పని చేయడమే అవసరమన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆహ్వానాన్ని ఆమోదించలేకపోతున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్‌లో సాగిన తర్జనభర్జనలు

మరో వైపు ఎన్నికల్లో వరస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్‌తో మరోసారి కలిసి పని చేసేందుకు ప్రశాంత్ కిశోర్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల పలుమార్లు పార్టీ అధిష్ఠానంతో సమావేశమైన పికె..2024 సార్వత్రిక ఎన్నికలు , ఈ ఏడాది జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేశారు. దీంతో పికె ఎన్నికల వ్యూహాలు, నివేదిక అధ్యయనానికి సోనియా గాంధీ మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం నేతృత్వంలో ఓ కమిటీ వేశారు. ఈ కమిటీ తన నివేదికను సోనియాకు అందజేసింది. ప్రశాంత్ కిశోర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై పార్టీలో కొంతకాలంగా తర్జన భర్జనలు కొనసాగాయి. ఆయన రాక పార్టీ పునరుత్థానికి అవసరమని కొందరు నేతలు అభిప్రాయపడగా, ఇతర పార్టీలతో సంబంధాలను పూర్తిగా తెంచుకుంటేనే పార్టీలో చేరికకు అనుమతించాలని మరికొందరు వాదిస్తూ వచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా నివాసంలో సోమవారం పలువురు సీనియర్ నేతలు ఇదే అంశంపై చర్చించారు. పార్టీ పునరుత్థానం కోసం ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన ప్రణాళికపైనా మంతనాలు జరిపారు.

ప్రియాంకా గాంధీ వాద్రా, అంబికా సోనీ వంటి వారు పార్టీలో ఆయన చేరికకు సుముఖంగా ఉండగా, దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, సుర్జేవాలా, జైరాం రమేశ్ ప్రస్తుతానికి విముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. వైకాపా, తెరాస, తృణమూల్ కాంగ్రెస్ వంటి ఇతర పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయకూడదంటూ షరతు విధించి అందుకు అంగీకరిస్తేనే ప్రశాంత్ కిశోర్‌ను పార్టీలో చేర్చుకోవాలనే అభిప్రాయాలు ఈ సమావేశంలో ఎక్కువగా వ్యక్తమైనట్లు వార్తలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ ( తృణమూల్ కాంగ్రెస్) , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (వైకాపా)లకు ఆయన రాజకీయ సలహాదారుగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే ఆయన సంస్థ ఐప్యాక్ తెలంగాణలో తెరాసతో కలిసి పని చేసేందుకు తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇలా ప్రత్యర్థి పార్టీలతో ఒప్పందాలు కొనసాగితే కాంగ్రెస్ పునరుత్థాన ప్రణాళికల అమలులో ఇబ్బందులు ఎదురవుతాయని దిగ్విజయ్ తదితరులు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పికె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News