విదేశీయుడి పొట్టలో డ్రగ్స్. వీడొక్కడే మూవీ సీన్ రిపీట్
మన తెలంగాణ/హైదరాబాద్ : మాదకద్రవ్యాల విషయంలో అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అక్రమ రవాణా మాత్రం అడ్డుకట్టపడటం లేదు. నిత్యం దేశంలో ఏదో చోట డ్రగ్స్ వ్యవహారం బయటపడుతూనే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.కోట్ల విలువైన డ్రగ్స్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు పట్టుకుంటున్నారు. తాజాగా ఓ విదేశీయుడి పొట్ట నుంచి రూ.12 కోట్ల విలువైన కొకైన్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. టాంజానియాకు చెందిన సాలె అనే వ్యక్తి ఈ నెల 21న జొహానెస్‌బర్గ్ నుంచి ప్రిటోరియాకు వెళ్లాడు. అక్కడి నుంచి హైదరాబాద్ శం షాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే ముందు డ్రగ్స్ క్యాప్సూల్స్‌ను మింగేశాడు. మూ డు రోజల తర్వాత అతడు హైదరాబాద్‌లోని ఓ తెలియని వ్యక్తికి అప్పజెప్పాల్సి ఉంది. అయితే ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు శంషాబాద్ విమాశ్రయంకు చేరుకున్న సాలెను డీఆర్‌ఐ అధికారులు తనిఖీ చేశారు. అతడి వద్ద ఉన్న 22 కొకైన్ క్యాప్సుల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అంతేకాకుండా నిందితుడు తన కడుపులో కొకైన్ క్యాప్సుల్స్ తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. దాంతో డీఆర్‌ఐ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 5 రోజుల వ్యవధిలో అతడి పొట్టలోంచి వైద్యులు 58 కొకైన్ క్యాప్సుల్స్‌ను వెలికితీశారు. మొత్తంగా నిందితుడి నుంచి 79 కొకైన్ క్యాప్సుల్స్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు 79 క్యాప్సుల్స్ తూకం వేయగా 1,157 గ్రాములు కొకైన్ ఉన్నట్లు తేల్చారు. ఈ మొత్తం కొకైన్ అంతర్జాతీయ మార్కెట్లో రూ.11.57 కోట్లు ఉంటుందని అంచనా. టాంజానియా దేశస్థుడిపై ఎన్‌డిపిసి చట్టం కింద కేసు నమోదు చేసిన డీఆర్‌ఐ అధికారులు అతడిని రిమాండ్‌కి తరలించారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో ఇంత మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి.
వీడొక్కడే మూవీ సీన్ రిపీట్…
డ్రగ్స్ స్మగ్లింగ్ రోజురోజుకూ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. పోలీసులు, అధికారులకు చిక్కకుండా ఉండేందుకు స్మగ్లర్లు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. వీడొక్కడే సినిమాలో చూపించినట్లు విగ్రహాల్లో డ్రగ్స్ కలిపి స్మగ్లింగ్ చేస్తున్నారు. మత్స్యకారుల బోటుల్లో దేశంలోకి డ్రగ్స్ తరలిస్తున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ ఎలా చేస్తారో సూర్య వీడొక్కడే సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమాలో డ్రగ్స్ క్యాప్సుల్స్‌ను మింగి, వాటిని కడుపులో పెట్టుకుని మలేషియాకు తరలిస్తారు. సేమ్ టూ సేమ్ అలాంటి ఘటనలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో వెలుగుచూడటం గమనార్హం.
రెండ్రోజుల వ్యవధిలో…
నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో ఈనెల 24న నైరోబి నుంచి హైదరాబాద్ వచ్చిన పెంజానీ లగేజిని డీఆర్‌ఐ అధికారులు తనిఖీ చేశారు. ట్రాలీ బ్యాగ్ అడుగు భాగాన రెండు ప్లాస్టిక్ కవర్లలల్లో తెల్లటి పౌడర్ లభ్యమైంది. వెంటనే పెంజానీ అనే ప్రయాణీకురాలిని అదుపులోకి తీసుకున్నారు. నైరోబి నుంచి డోహ్ మీదుగా బిజినెస్ వీసాపై హైదరాబాద్ వచ్చిన మాలవ్యన్ దేశస్థురాలు డీఆర్‌ఐ అధికారుల కళ్లు గప్పి బయట పడేందుకు యత్నించారు. బిజినెస్ వీసాపై రావడంతో నిఘా సంస్థలు అంతగా పట్టించుకోవని ఆమె భావించారు. కాని ముందుగానే డీఆర్‌ఐ అధికారుల వద్ద సమాచారం ఉండడంతో ఆమె లగేజిని పూర్తి స్థాయిలో సోదాలు చేశారు. పట్టుబడిన తెల్లటి పౌడర్‌ను పరీక్షలు చేయగా అది హెరాయిన్ అని తేలింది.
పట్టుబడిన 3.129 కిలోల హెరాయిన్ అంతర్జాతీయ మార్కెట్లో రూ.21.90 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. వెంటనే ఆ ప్రయాణీకురాలిని అరెస్టు చేసిన డీఆర్‌ఐ అధికారులు జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. రెండు రోజుల్లో రూ.33.47 కోట్లు విలువైన 3.129కిలోల హెరాయిన్, 1,157 గ్రాముల కొకైన్‌ను డిఆర్‌ఐ అధికారులుస్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ అధికారులు… ఇద్దరు ప్రయాణీకులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి రాబట్టిన సమాచారంపై మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌కు తరలించిన ఈ మాదకద్రవ్యాలు ఇక్కడ స్థానికంగా ఎవరికైనా విక్రయించేందుకా? లేక ఇక్కడ నుంచి బయట రాష్ట్రాలకు కాని, దేశాలకుకాని తరలించేందుకు వేసిన ఎత్తులా అన్నదానిపై ఆరా తీస్తున్నారు.