విద్వేషాలు రగిల్చి విధ్వంసాలు సృష్టిస్తే ఎవ్వరూ ఊరుకోరు
కరోనాపై కాన్ఫరెన్స్ పెట్టి, పెట్రోల్‌పై పన్ను తగ్గించాలంటారా, సిగ్గుందా?
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని మోదీ నీ ఆటలు సాగవంటూ సిఎం కెసిఆర్ ప్రధానిని హెచ్చరించారు. టిఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీలో ముగింపు సందర్భంగా సిఎం కెసిఆర్ ప్రధానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్వేషాలు రగిల్చి విధ్వంసాలు సృష్టిస్తే ఎవ్వరూ ఊరుకోరని సిఎం కెసిఆర్ ప్రధానిపై మండిపడ్డారు. ఈ దేశానికి ప్రధాని మోదీ ఏం చేశారని, ఏ రంగంలో అభివృద్ధి సాధించారో చెప్పాలని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. ఇస్లామిక్ దేశాల్లో ఆలయాలు కడుతున్నారని, మనదేశంలో అశాంతిని చెలరేగేలా రెచ్చగొడుతున్నారని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఉద్వేగం, విద్వేషం రెచ్చగొడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 500 సంస్థానాలను విలీనం చేసుకొని ఒక ఫెడరల్ శక్తిగా ఏర్పడ్డ దేశం భారతదేశమని కెసిఆర్ తెలిపారు. అలాంటి దేశం, ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో నడుస్తున్న తరుణంలో భయకరంమైన విషాన్ని ఈ దేశంలో జొప్పిస్తున్నారన్నారు. బిజెపి విద్వేషాలపై తన ప్రసంగం విన్న రచయిత్రి జయప్రభ తనకు ఫోన్ చేశారని, ఈ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికే ఉందని ఆమె తనతో పేర్కొన్నారని సిఎం తెలిపారు.
సిఎంలతో ప్రధానిడ్రామా కాన్ఫరెన్స్
ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సిఎంలతో డ్రామా కాన్ఫరెన్స్ పెట్టారని, ప్రధాని నీకు సిగ్గుందా అంటూ కెసిఆర్ మండిపడ్డారు. కరోనాపై కాన్ఫరెన్స్ పెట్టి, పెట్రోల్‌పై పన్ను తగ్గించాలంటారా? అని ప్రధానిని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. ఏ నోటితో తగ్గించాలని ప్రధాని అడుగుతారని సిఎం నిలదీశారు. ఇదేనా ప్రధాని మాట్లాడాల్సిన విధానమని కెసిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడ్డాక మనం ఒక్క పైసా డీజిల్ పెట్రోల్ ధర పెంచలేదనీ, తాము ఎందుకు ట్యాక్స్ తగ్గించాలని కెసిఆర్ ప్రధానిని ప్రశ్నించారు. పన్నులు పెంచిన పాపాలభైరవులు కేంద్రంలోని పెద్దలేనని సిఎం కెసిఆర్ ఆరోపించారు.
పెంచిన డీజిల్ ధరలతో ఆర్టీసీపై భారం
కేంద్రం పెంచిన డీజిల్ ధరలతో ఆర్టీసి మీద డైరెక్టుగా భార పడుతుందన్నారు. దాదాపు రూ.2 నుంచి రూ.3 కోట్ల ఆర్టీసిపై అదనపు భారం పడుతుందన్నారు. ఆర్టీసిని త్వరగా అమ్మేయాలని ప్ర ధాని మోదీ ప్రైజులు సైతం పెట్టాడని ఆయన ఆరోపించారు. ఆర్టీసిని అమ్మినోళ్లకు ప్రధాని రూ. 1000 కోట్ల బహుమతిని పెట్టిండని కెసిఆర్ ఆరోపించారు. ఇప్పటికే ప్రధాని అమ్మేది చాలదనీ మనం కూడా అమ్ముకోవాలని ఆయన సూచిస్తున్నారని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అబద్దాలు, అసత్యాల పునాదుల మీద ఓట్ల కోసం వేట…
ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ కత్తులు పట్టుకొని ఊరేగుతున్నాతారా అని సిఎం నిలదీశారు. మనిషికోసం మతమా?.. మతం కోసం మనిషా..? అని కెసిఆర్ ప్రశ్నించారు. అబద్దాలు, అసత్యాల పునాదుల మీద ఓట్ల కోసం వేట జరుగుతుందని అందరం కలిసి కట్టుగా ఎదుర్కొనకపోతే, చాలా సమస్యలు తప్పవని కెసిఆర్ హెచ్చరించారు. ప్రధాని కుర్చీ అనేది మన లక్ష్యం కాదనీ, ఫ్రంట్‌లు, టెంట్‌లు అనేది ముందుకు సాగవన్నారు. చైనా పాలసీ కంటే ఇండియా పాలసీ బెటర్‌గా ఉంటే ఎందుకు అభివృద్ధి చెందలేదన్నది ప్రశ్నగా మారిందన్నారు. ఇండియా కంటే సింగపూర్‌లో టూరిజం బాగా లేదని, అయినా ప్రపంచం అంతా సింగపూర్‌కు వెళ్తారన్నారు. కలలను నిజం చేసుకోవచ్చు అందుకు ఉదాహరణే తెలంగాణ రాష్ట్రమన్నారు. మనస్సుపెట్టి చేస్తే అమెరికాను మించిన ఆర్థికశక్తిగా ఇండియా మార్చవచ్చన్నారు. దేశానికి కొత్త ఎజెండాను తయారు చేయడానికి తాను ఒక సైనికుడిని అవుతానన్నారు. బిజెపి పార్టీ నాయకులకు సిగ్గు ఉండదని, బిజెపి దుర్మార్గుల నీతిని ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. బిజెపి నుంచి దేశాన్ని రక్షించుకోవాలని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.
దేశ జీడిపి, ఆర్థిక వ్యవస్థ దారుణంగా క్షీణించింది
దేశ జీడిపి, ఆర్థిక వ్యవస్థ దారుణంగా క్షీణించిందని సిఎం కెసిఆర్ ఆరోపించారు. ప్రసంగాల జోరు, అబద్ధాల హోరు తప్ప మోదీ పాలనలో ఏమీ లేదన్నారు. యువకులను రెచ్చగొట్టి కల్లోలం సృష్టించడమే బిజెపి వ్యూహామని సిఎం కెసిఆర్ ఆరోపించారు. ఒక్కసారి విధ్వంసం చెలరేగితే దీర్ఘకాలం నష్టపోవాల్సి వస్తుందని కెసిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఘర్షణలు జరిగితే పెట్టుబడులు, కంపెనీలు రావన్నారు. మతం గురించి తప్ప అభివృద్ధి, సంక్షేమం గురించి బిజెపి ఎప్పుడైనా మాట్లాడిందా అని కెసిఆర్ ప్రశ్నించారు.
అనుమానాలొద్దు….టిఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి…
తమ పార్టీ కన్సల్టెంట్‌ను కూడా పెట్టుకుందని మళ్లీ టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అనుమానాలొద్దని పార్టీ నేతలు, కార్యకర్తలకు సిఎం కెసిఆర్ సూచించారు. విదేశాల్లో సైతం మన గుడులున్నాయని, అక్కడున్న వాళ్లు ప్రగతిపూర్వకంగా ఆలోచిస్తున్నారని కెసిఆర్ తెలిపారు. జాతీయ పార్టీ కోసం ఫండ్ కావాలంటే టిఆర్‌ఎస్‌కు ఉన్న 60 లక్షల సభ్యత్వమే తమ బలమన్నారు. 60లక్షల సభ్యత్వం ఉన్న తమకు తలా ఒక్క వెయ్యి రూపాయలు ఇచ్చినా రూ.600 కోట్లు అవుతుందని, ఒక్క కాల్ చేస్తే రూ.600 కోట్లు విరాళాలు వస్తాయని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. జాతీయ పార్టీ అంటే దాతలు విరాళాలు ఇచ్చారని, టిఆర్‌ఎస్ పార్టీకి రూ.861కోట్లు నిధులు ఉన్నాయన్నారు. వాటిని ఎస్‌బిఐ, -బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఫిక్స్‌డ్ చేశామని వడ్డీ రూపంలో నెలకు రూ.3కోట్ల 81లక్షల పార్టీకి వస్తుందన్నారు. జిల్లా పార్టీ కార్యాలయాలు కలిపితే సుమారు వెయ్యి కోట్లకు పైగా ఆస్తులను పార్టీ కలిగి ఉంటుందని ఆయన తెలిపారు. పార్టీకి రెండు ఇన్నోవా కార్లు- ఒక ఫోర్ట్ వాహనం ఉందని, మరిన్ని వాహనాలను కొనుగోలు చేస్తామన్నారు.
నియోజకవర్గాల్లో కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలపై…
నియోజకవర్గాల్లో కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చినా విధిగా ప్రజల కోసం పనిచేస్తానన్నారు. ఎవరూ అవాకులు, చెవాకులు మాట్లాడినా పట్టించుకోవద్దన్నారు. సర్వేల్లో 90స్థానాలకు పైగా టిఆర్‌ఎస్ గెలుస్తుందని సర్వే ఫలితాలు వచ్చాయన్నారు. మనం ముందుకు వెళదాం తప్పకుండా విజయం సాధిస్తామన్నారు. త్వరలో కార్యకర్తలకు శిక్షణా తరగతులు ఉంటాయని సిఎం తెలిపారు. మన రాష్ట్రం నుంచి పార్టీ ప్రతినిధులు విదేశాల టూర్ ఉంటుందన్నారు. పార్టీలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకుందామన్నారు.
రిటైర్డ్ ఐఏఎస్, ఐపిఎస్‌లు, మేధావులతో సదస్సు
అవసరమైన సమయంలో జాతీయ రాజకీయాలపై ముందుకు వెళతాతనన్నారు. జాతీయ రాజకీయాలపై దేశ-, విదేశాల నుంచి ముఖ్యమైన చర్చలు త్వరలోనే జరుపుతానన్నారు.- రిటైర్డ్ ఐఏఎస్, ఐపిఎస్‌లు, దేశంలోని మేధావులు, ఆఫీసర్లతో హైదరాబాద్‌లో సమావేశం పెడతానన్నారు. దేశ, విదేశాల్లోని ఆర్థిక వేత్తలతో పాటు హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి ప్రముఖులు హాజరవుతారన్నారు.