సిక్కు గ్రూపులతో తలపడిన శివసైనికులు
పాటియాల: పంజాబ్‌లోని పాటియాలలో కాళీమాత ఆలయ సమీపంలో శుక్రవారం శివసేన(బాల్ థాకరే) కార్కకర్తలు, కొన్ని సిక్కు గ్రూపుల మధ్య పరస్పరం రాళ్ల దాడులు జరిగాయి. ఈ సందర్భంగా కత్తులతో సిక్కు గ్రూపు సభ్యులు రోడ్లపైకి రావడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఖలిస్తానీ గ్రూపులకు వ్యతిరేకంగా శివసేన నిర్వహించిన ఊరేగింపు సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. పంజాబ్ శివసేన(బాల్ థాకరే) వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ సింగ్లా ఈ ర్యాలీ నిర్వహించారు. రాలీ జరుగుతుండగా శివసైనికులు ఖలిస్తానీ వ్యతిరేక నినాదాలు చేస్తున్న సమయంలో కొన్ని సిక్కు గ్రూపులకు చెందిన సభ్యులు వారితో తలపడ్డారు. కత్తులు పట్టుకుని సిక్కు గ్రూపు సభ్యులు ముందుకు రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇరు పక్షాలకు చెందిన సభ్యులు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో శుక్రవారం వైరల్ అయ్యాయి.