అప్పుడే ప్రజలకు న్యాయవ్యవస్థపై విశ్వాసం పెరుగుతుంది
ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో స్థానిక భాష వాడాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. స్థానిక భాషలను ఉపయోగిస్తే సామాన్యులకు న్యాయవ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని, మరింత సన్నిహితమయ్యామనే భావన కలుగుతుందని అన్నారు. శనివారం ఇక్కడ ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశంలో ప్రధాని మాట్లాడారు. ‘ న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.దీనివల్ల సామాన్యులకు న్యాయవ్యవస్థపై నమ్మకం పెరగడమే కాకుండా మరింత సన్నిహితమయ్యామనే భావన కలుగుతుంది’ అని ప్రధాని అన్నారు. న్యాయం సులువుగా అందడానికి వీలుగా కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయాలని ముఖ్యమంత్రులకు మోడీ సూచించారు. ప్రస్తుత కాలానికి సరిపడని సుమారు 1800 చట్టాలను కేంద్రప్రభుత్వం గుర్తించిందన్నారు.
వీటిలో 1450 చట్టాలను రద్దు చేశామన్నారు. అయితే ఇటువంటి 75 చట్టాలను మాత్రమే రాష్ట్రాలు రద్దు చేశాయన్నారు. మన దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకోబోతున్న ప్రస్తుత తరుణంలో న్యాయం సులువుగా అందుబాటులో ఉండే న్యాయవ్యవస్థను సృష్టించడంపై దృష్టి ఉండాలన్నారు. న్యాయం వేగంగా, ప్రతి ఒక్కరికీ అందే విధంగా న్యాయవ్యవస్థను తీర్చిదిద్డంపై దృష్టిపెట్టాలన్నారు. మన దేశంలో రాజ్యాంగ పరిరక్షకురాలి పాత్రను న్యాయవ్యవస్థ పోషిస్తోందన్నారు. చట్టసభలు ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తాయన్నారు. ఈ రెండింటి కలయిక సమర్థవంతమైన, నిర్ణీత కాలంలో న్యాయాన్ని అందజేసే న్యాయవ్యవస్థకు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తుందని తాను విశ్వసిస్తున్నానని ప్రధాని అన్నారు. న్యాయస్థానాల్లో స్థానిక భాషను ఉపయోగించాలని ప్రధాని నొక్కి చెబుతూ ‘హైకోర్టులు స్థానిక భాషలను ఉపయోగించడం గురించి సిజెఐ ప్రస్తావించారు. ఇది అమలు కావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అయితే ఇది న్యాయవ్యవస్థ ప్రజలకు చేరువ అవుతుంది. వైద్య, సాంకేతిక విద్యల బోధనను మన మాతృభాషలో ఎందుకు చేయకూడదు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఆ పని చేస్తున్నాయి’అని మోడీ అన్నారు.