వాతావరణ విభాగం వెల్లడి
న్యూఢిల్లీ : దేశం లోని చాలా ప్రాంతాల్లో వడగాలుల పరిస్థితులు తగ్గుముఖం పడుతున్నాయని భారత వాతావరణ విభాగం సోమవారం వెల్లడించింది. ఈనెల 4 వరకు వాయువ్య బారతంలో ఉరుములతోపాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు, దక్షిణ భారత్‌లో ఆరో తేదీ వరకు , ఈశాన్య ప్రాంతంలో మూడో తేదీ వరకు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని చెప్పింది. ఇటీవలి వారాల్లో అత్యంత వేడి పరిస్థితులు ఎదుర్కొన్న ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ తదితర ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు ల్లో వచ్చే ఐదు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గత నెలలో దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, హర్యానా , పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, తదితర రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఏప్రిల్‌లో ఉత్తరాదిన 40 డిగ్రీలు, వాయువ్యభారత్‌లో 35.90 డిగ్రీలు, మధ్యభారత్‌లో 37.78 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. దేశ వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 35.05 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఏప్రిల్‌లో సగటు ఉష్ణోగ్రత ఈ స్థాయిలో ఉండటం, 122 ఏళ్లలో ఇది నాలుగోసారి మాత్రమే కావడం గమనార్హం.