Sunday, December 22, 2024

‘ఇ’-విప్లవమే

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం కృషివల్ల పెట్టుబడుల గమ్యంగా మారిన తెలంగాణ

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పలు దేశి, విదేశి కంపెనీలు అమితాసక్తిని చూపుతున్నాయి ఎనిమిదేళ్ల
కాలంలోనే సిఎం కెసిఆర్ సమర్థ సారథ్యంలో రాష్ట్రం అన్నిరంగాల్లో దూసుకుపోతున్నది శాంతి మౌలిక
వసతుల కల్పన పెట్టుబడిదారులకు ఆకర్షణగా మారాయి సింగిల్ లార్జెస్ట్ టివిల ఉత్పత్తి కంపెనీ రెడియేంట్
అప్లయన్సెస్ దేశంలోనే అతిపెద్ద ఎల్‌ఇడి టివి కంపెనీ మంది పైగా పనిచేస్తున్నారు.. 53% మహిళలే, 60%
తెలంగాణ వారే: ఈ కంపెనీ కొత్త యూనిట్ రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్/మహేశ్వరం: ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి రంగంలో రానున్న పదేళ్లలో రెండున్నర లక్షల కోట్ల ఆదాయం సమకూర్చుకోవడమే కాకుండా 16లక్షల ఉద్యోగాలు సృష్టించడమే టిఆర్‌ఎస్ ప్రభుత్వ లక్షమని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు స్పష్టం చేశారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఫలితంగా పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం గమ్యస్థానంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలోనే అనేక దేశీయ, విదేశీ కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత ఆసక్తిని చూపిస్తున్నామని మంత్రి కెటిఆర్ అన్నారు. కేవలం ఎనిమిది సంవత్సరాల కాలంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో దూసుకపోతోందన్నారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వంతో పాటు సమర్థవంతమైన నాయకత్వం ఉన్నందునే ఇది సాధ్యమవుతోందని ఆయన ఉద్ఘాటించారు. జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని రావిర్యాల ఇ-సిటీలో రేడియంట్ అప్లయేన్సెస్ సంస్థ ఏర్పాటు చేసిన నూతన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, దేశంలోని ప్రముఖ సంస్థలన్నీ రాష్ట్రంలో తమ వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. దీని కారణంగానే పరిశ్రమలకు రాష్ట్రం అడ్డాగా మారిందన్నారు. తెలంగాణను వ్యాపారానికి అనుకూలంగా మలిచేందుకు సిఎం కెసిఆర్ ఎన్నో చర్యలు చేపట్టారన్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన శాంతిభద్రతలు, మౌలిక వసతులు, పెట్టుబటి దారులకు అవసరమైన సహాయ సహకారాలను అందించిన కారణంగానే చాలా కంపెనీలు తమ సంస్థలను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. నేపథ్యంలో దేశంలోనే సింగల్ లార్జెస్ట్ టివి ఉత్పత్తి చేసే కంపెనీ రేడియంట్ అప్లయెన్సెస్ అని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ కంపెనీ నుంచి 50 లక్షల టివిలు రాష్ట్రం నుంచి తయారవ్వడం చాలా గర్వంగా ఉందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. దేశంలోనే అతిపెద్ద ఎల్‌ఇడి టివి కంపెనీ ఇదేనని అన్నారు. రేడియంట్ కంపెనీలో ప్రస్తుతం 3,800ల మందికి పైగా పని చేస్తున్నారన్నారు. యూనిట్ ప్రారంభంలో సంవత్సరానికి 4 లక్షల టివిలు తయారు చేద్దామని అనుకున్నప్పటికీ….. నెలకు 4 లక్షల టివిలు తయారు చేసే స్థాయికి ఎదగడం మరింత సంతోషంగా ఉందన్నారు.

ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఈ సంస్థల కల్పిచిన ఉద్యోగుల్లో 53 శాతం మహిళలు ఉండగా, 60 శాతం మన రాష్ట్రం వారే ఉన్నారని కెటిఆర్ స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మరింతగా విస్తరిస్తే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇప్పటికే ఫ్యాబ్ సిటీలో 15 వేల మంది ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. రాబోయే సంవత్సర కాలంలో ఈ సంఖ్య 15 వేల నుంచి 40 వేలకు చేరుకోబోతుందన్నారు. శేరిలింగంపల్లిలో ఇటీవలే ప్రపంచంలోనే రెండో అతిపెద్దదైన గూగుల్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేశామన్నారు. అలాగే కొత్తూరులో లిక్విడ్ డిటర్జెంట్ యూనిట్‌ను ప్రారంభించామన్నారు. ఈ రకంగా ఎలక్ట్రానిక్స్‌తో పాటు రాష్ట్రం సాఫ్ట్‌వేర్, హార్ట్‌వేర్ రంగాల్లో కూడా బహుముఖంగా దూసుకుపోతున్నదన్నారు..

భారీగా పెరిగిన కంపెనీ ఆదాయం

రేడియంట్ కంపెనీ ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన శ్యాంసంగ్, వన్ ప్లస్, పానాసోనిక్, అమేజాన్ స్కైవర్త్త్, నోకియా, మోటోరోలా వంటి కంపెనీల టివిలను తయారు చేస్తుందని కెటిఆర్ తెలిపారు. దీంతో కంపెనీ ఆదాయం 35 రెట్లు పెరిగిందని సదరు యాజమాన్యం తెలిపిందన్నారు. ఈ ఆదాయం పెరగడానికి కారణం రాష్ట్రంలో ఉన్న సానుకూల వాతావరణమేనని అన్నారు. రాష్ట్రంలో గత కొన్నేండ్ల నుంచి కరెంట్ కోతలు లేవన్నారు. కరెంట్ కోతలుంటే పరిశ్రమలు సరిగా నడవవు అని అన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో కరెంట్ కోతలను అధిగమించామన్నారు. పరిశ్రమలకే కాకుండా అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని కెటిఆర్ స్పష్టం చేశారు. దీని కారణంగా రాష్ట్రంలో పెట్టుబడలు పెట్టిన వారు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారన్నారు. ఫలితంగా రాష్ట్రంలో వ్యాపారాలను కొసాగిస్తున్న కంపెనీలు పెద్దమొత్తంలో లాభాలను అర్జిస్తున్నాయన్నారు. ఈ తరహాలోనే రేడియంట్ కంపనీ ఆదాయంకూడా గణనీయంగా పెరిగిందన్నారు. త్వరలోనే రాష్ట్రంలో మరో రెండు ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామని కంపెనీ యజమాన్యం తనతో చెప్పిందన్నారు. కాగా ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డితో పాటు పలువురు కంపెనీకి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

రూ.200 కోట్లతో లిక్విడ్ డిటర్జెంట్ ఉత్పత్తి యూనిట్

రాష్ట్రంలో రెండు వందల కోట్లను పెట్టుబడి పెట్టేందుకు ప్రొక్టర్ అండ్ గ్యాంబిల్ ( పి అండ్ జి) సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుంది. పీరియడ్స్ సమయంలో మహిళలు పాటించాల్సిన జాగ్రత్తలు, హైజీన్ ఎడ్యుకేషన్‌పై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వంతో కలిసి ఈ సంస్థ పనిచేయనుంది. ఈ సందర్భంగా స్కూలు పిల్లల కోసం లక్షా 30 వేల శానిటరీ ప్యాడ్‌లను ఆ సంస్థ విరాళంగా అందించింది.
షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలోని పెంజర్ల గ్రామంలో పి అండ్ జి సంస్థ నూతనంగా నెలకొల్పిన లిక్విడ్ డిటర్జెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూ. 200 కోట్ల పైచిలుకుతో కంపెనీని ప్రారంభం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్ అంతా లిక్విడ్ డిటర్జెంట్స్‌దేనని పి అండ్ జి ప్రతినిధులు చెబుతున్నారన్నారు. ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కెటిఆర్ పేర్కొన్నారు. కంపెనీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
కరోనా మహమ్మారి సమయంలో పి అండ్ జి సంస్థ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మద్దతు ఇచ్చినందుకు ఈ సందర్భంగా కెటిఆర్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. లింగ సమానత్వం కోసం పి అండ్ జి చేస్తున్న కృషి ఎంతో ఆకట్టుకుందన్నారు. 2014లో సిఎం కెసిఆర్ ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. ఈ ఆరేండ్ల కాలంలో రాష్ట్రంలో పి అండ్ జి తన కార్యకలాపాలను బాగా విస్తరించిందన్నారు. రానున్న రోజుల్లో డిటర్జెంట్ లిక్విడ్ వినియోగం మరింత అధికం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్‌ఎ అంజయ్య యాదవ్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, కమీషనర్ భాస్కర్‌తో పాటు పి అండ్ జి కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News